కృత్రిమ గుండె తయారీపై..ఓయూలో పరిశోధన | Research On Artificial Heart Preparation At Osmania University | Sakshi
Sakshi News home page

కృత్రిమ గుండె తయారీపై..ఓయూలో పరిశోధన

Apr 9 2021 4:01 AM | Updated on Apr 9 2021 12:08 PM

Research On Artificial Heart Preparation At Osmania University - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: కృత్రిమ గుండె తయారీపై ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇంజనీరింగ్‌ కాలేజీలోని సెంటర్‌ ఫర్‌ ప్రోడక్ట్‌ డిజైన్‌ డెవలఫ్‌మెంట్‌ ఆడిటివ్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీడీడీఏఎం), ఉస్మానియా మెకానికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగాలు సంయుక్తంగా ఈ పరిశోధన చేస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే ఎముకలు, దంతాలు, మోకాలి చిప్పలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్‌ వస్తువుల తయారీలో అనుభవం సంపాదించిన పరిశోధకులు.. తాజాగా కృత్రిమ గుండె తయారీపై దృష్టి సారించారు. గుండె ఆకృతి రూపకల్పనకు సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే తయారుచేసిన గుండె పనితీరును ముందు జంతువులపై ప్రయోగించనున్నారు. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాతే మానవులకు అమర్చనున్నారు. ఈ కృత్రిమ గుండె రూప కల్పన పరిశోధనలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలో డాక్టర్‌ ఎల్‌.శివరామకృష్ణ, డాక్టర్‌ మధుసూదన్‌రాజు సహా మరో ముగ్గురు పరిశోధక విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కృత్రిమ గుండెను తయారు చేశారు. దానికి అమర్చిన బ్యాటరీ బరువు రెండున్నర కేజీలకుపైగా ఉంది. బ్యాటరీ బరువును 500 గ్రాములకు తగ్గించారు. గుండెకు సమీపంలో ఛాతీ లోపలే బ్యాటరీ అమర్చే వెసులుబాటును కల్పించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

రూసా నిధులతో అభివృద్ధి: సీపీడీడీఏఎం డైరెక్టర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌
‘రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్ష అభియాన్‌ (రూసా) ప్రాజెక్టు ద్వారా వచ్చిన రూ.5.5 కోట్లతో వర్సిటీలో ఈ సీపీడీడీఏఎం అభివృద్ధి చేశాం. సహజమైన గుండె పనితీరుకు ఏ మాత్రం తీసి పోనివిధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేబుల్‌తో పనిలేకుండా ఛాతీ లోపల ఉన్న బ్యాటరీనీ ఎప్పుడంటే అప్పుడు రీచార్జి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. గుండెపైనే కాకుండా కాలేయం, ఊపిరితిత్తులపై కూడా పరిశోధనలు చేస్తున్నాం.’ 

చదవండి: ‘టి ఫైబర్‌’తో రైతు వేదికలకు ఇంటర్నెట్‌.. 

Advertisement
 
Advertisement
Advertisement