breaking news
artifical heart
-
కృత్రిమ గుండె తయారీపై..ఓయూలో పరిశోధన
ఉస్మానియా యూనివర్సిటీ: కృత్రిమ గుండె తయారీపై ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇంజనీరింగ్ కాలేజీలోని సెంటర్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్ డెవలఫ్‌మెంట్ ఆడిటివ్ మేనేజ్మెంట్ (సీపీడీడీఏఎం), ఉస్మానియా మెకానికల్ ఇంజ నీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఈ పరిశోధన చేస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే ఎముకలు, దంతాలు, మోకాలి చిప్పలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్ వస్తువుల తయారీలో అనుభవం సంపాదించిన పరిశోధకులు.. తాజాగా కృత్రిమ గుండె తయారీపై దృష్టి సారించారు. గుండె ఆకృతి రూపకల్పనకు సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తయారుచేసిన గుండె పనితీరును ముందు జంతువులపై ప్రయోగించనున్నారు. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాతే మానవులకు అమర్చనున్నారు. ఈ కృత్రిమ గుండె రూప కల్పన పరిశోధనలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలో డాక్టర్ ఎల్.శివరామకృష్ణ, డాక్టర్ మధుసూదన్‌రాజు సహా మరో ముగ్గురు పరిశోధక విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కృత్రిమ గుండెను తయారు చేశారు. దానికి అమర్చిన బ్యాటరీ బరువు రెండున్నర కేజీలకుపైగా ఉంది. బ్యాటరీ బరువును 500 గ్రాములకు తగ్గించారు. గుండెకు సమీపంలో ఛాతీ లోపలే బ్యాటరీ అమర్చే వెసులుబాటును కల్పించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రూసా నిధులతో అభివృద్ధి: సీపీడీడీఏఎం డైరెక్టర్ శ్రీరామ్ వెంకటేశ్ ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (రూసా) ప్రాజెక్టు ద్వారా వచ్చిన రూ.5.5 కోట్లతో వర్సిటీలో ఈ సీపీడీడీఏఎం అభివృద్ధి చేశాం. సహజమైన గుండె పనితీరుకు ఏ మాత్రం తీసి పోనివిధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేబుల్‌తో పనిలేకుండా ఛాతీ లోపల ఉన్న బ్యాటరీనీ ఎప్పుడంటే అప్పుడు రీచార్జి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. గుండెపైనే కాకుండా కాలేయం, ఊపిరితిత్తులపై కూడా పరిశోధనలు చేస్తున్నాం.’ చదవండి: ‘టి ఫైబర్’తో రైతు వేదికలకు ఇంటర్నెట్.. -
గుండె లేకుండా ఏడాదికి పైగా బతికేశాడు!
గోపీచంద్ హీరోగా చేసిన ఒక్కడున్నాడు సినిమా గుర్తుందా. అందులో విలన్ మహేష్ మంజ్రేకర్‌కు గుండెలో సమస్య ఉండటంతో బయట ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకుని దాంతోనే బతికేస్తుంటాడు. అతడికి గుండెమార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే, గుండె లేకుండానే బతికేశాడన్న మాట. అమెరికాలో ఓ పాతికేళ్ల కుర్రాడు నిజంగా ఇలాగే గుండె లేకుండానే ఏడాదికి పైగానే బతికేశాడట!! అవును.. భుజాలకు వెనకాల తగిలించుకునే బ్యాగ్ ప్యాక్ లాంటి సంచిలో కృత్రిమ గుండె పెట్టుకుని, 555 రోజుల పాటు అతడు ఉన్నాడు. ఆ కృత్రిమ గుండె అన్నిరోజుల పాటు రక్తాన్ని పంపింగ్ చేస్తూ అతడిని సజీవంగా ఉంచింది. ఎట్టకేలకు ఇటీవల అతడికి గుండె ఇవ్వడానికి ఒక దాత దొరకడంతో.. గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేసి, ఆ పరికరాన్ని తీసేశారు. అతడి పేరు స్టాన్ లార్కిన్. 2014 సంవత్సరంలో అతడికి మిచిగన్ రాష్ట్రంలో ఈ కృత్రిమ గుండెను అమర్చారు. దాని పేరు 'సిన్‌కార్డియా'. స్టాన్ లార్కిన్‌తో పాటు అతడి అన్న డోమ్నిక్కు కూడా కార్డియోమయోపతి అనే గుండె సమస్య ఉంది. దానివల్ల గుండె ఏ క్షణంలో అయినా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఏళ్ల తరబడి దాతల కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో సోదరులిద్దరూ సిన్‌కార్డియా అనే కృత్రిమ గుండెను అమర్చుకున్నారు. ఇద్దరిలో డోమ్నిక్కు త్వరగానే గుండె దాత దొరికారు. కానీ స్టాన్ మాత్రం చాలాకాలం పాటు వేచి ఉండాల్సి వచ్చింది. దాంతో కృత్రిమగుండెను ఒక బ్యాగ్ ప్యాక్‌లో అమర్చి, దాన్ని అతడికి తగిలించారు. దాని బరువు దాదాపు 6 కిలోలు. 24 గంటలూ అది వెంట ఉండాల్సిందే. లేకపోతే స్టాన్ బతకడు. అలాంటి పరిస్థితిలో కూడా అతడు బాస్కెట్‌బాల్ ఆడుతూ వైద్యులను ఆశ్చర్యపరిచాడు. ఎట్టకేలకు మే 9వ తేదీన అతడికి గుండెమార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.