
కేవలం ఒక అడుగు వెడల్పుతో ఉన్న మార్గం
భారీ భవనంలోకి వెళ్లటానికి ఉన్నది ఒకే ఒక్క ఇరుకు దారి
మూడు వైపుల ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి
పాతబస్తీలో చాలాప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు
10–20 గజాల్లో సెల్లార్ సహా నాలుగైదు అంతస్తులు
సాక్షి, హైదరాబాద్/చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనం నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ‘మోదీ పెరల్స్, శ్రీకృష్ణ పెరల్స్’సహా మొత్తం తొమ్మిది దుకాణాలు, నివాస గృహాలతో కూడిన ఈ భవనంలో అడుగడుగునా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు లేకపోవటం వల్లనే నిప్పంటుకున్న విషయాన్ని అందులోనివారు సకాలంలో గుర్తించలేకపోయారు.
హైదరాబాద్ నగరంలో ఇలాంటి నివాస గృహాలతో కూడిన మార్కెట్లు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో వాటి పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. నిబంధనల ప్రకారం ఇలాంటి వాణిజ్య, నివాస సముదాయాల్లో ఉండాల్సిన వ్యవస్థలు, అగ్నిప్రమాదం (Fire Accident) జరిగిన భవనం వద్ద ఉన్న పరిస్థితి ఇదీ..
అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ వన్‌గా, రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ టూ విధానంలో విడివిడిగా నిర్మితమైంది. మొత్తం భవన విస్తీర్ణంలో 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ఖాళీ స్థలం మాట అటుంచితే కనీసం రాకపోకలు సాగించడానికి అవసరమైన స్థాయిలో దారి, మెట్లు కూడా లేవు. భవనం చుట్టూ అగ్నిమాపక శకటాలు స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ముందు వైపు ఉన్న ప్రధాన రహదారి తప్ప మరెక్కడికీ ఫైర్ ఇంజిన్ కాదు కదా.. ద్విచక్ర వాహనం కూడా పోలేని విధంగా ఉంది.
ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపలి వైపు కూడా మెట్లు ఉండాలి. ఈ భవనానికి ప్రధానంగా ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఉంది. మరొకటి ఉన్నప్పటికీ అది కేవలం ఒక అడుగు వెడల్పుతో ఉంది. ఇవి తప్ప మరో మార్గం లేదు. మంటలార్పేందుకు భవనంలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉండాలి. ఈ భవనంలో కనీసం ఇసుక బక్కెట్లు కూడా లేవు. భవనంలో విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఇక్కడ ఈ రెండూ కనిపించట్లేదు.

ఇక్కడ అనుమతులు ఉండవు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో భవన నిర్మాణాల్లో చాలావరకు భద్రతా చర్యలు పాటించరనే అపవాదు ఉంది. 10–20 గజాల్లో అగ్గిపెట్టె లాంటి గృహ నిర్మాణాలు ఉంటాయి. జీహెచ్‌ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ అనుమతులు అసలే ఉండవు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక వాహనాలు పెళ్లేందుకు దారులు కూడా సక్రమంగా ఉండవు. దీంతో శకటాలను ప్రధాన రోడ్లపైనే దూరంగా నిలిపి సందుల్లోకి పైపులతో నీటిని తరలించాల్సి వస్తోంది. 10–20 గజాల్లో ఐదారు అంతస్తుల వరకు భవనాలను నిర్మించటంతోపాటు.. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లను సైతం నిర్మించి వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు.

గుల్జార్ హౌస్, పటేల్ మార్కెట్, ఘాన్సీ బజార్, కోకర్ వాడి, మీరాలం మండి, పురానీ హవేలి, కోట్లాఅలీజా, రైన్ బజార్, డబీర్ పురా, తలాబ్ కట్ట, భవానీనగర్, గంగానగర్, యశ్రబ్ నగర్, నర్కీపూర్‌బాగ్, సుల్తాన్ షాహి, అల్ జుబేర్ కాలనీ, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, కోకాకి తట్టి, దూద్ బౌలి, పురానాపూల్ (Puranapool) తదితర ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల వరకే అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలుంటోంది. దీంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.
భవనం పటిష్టతను పరీక్షించాలన్న ఎంపీ అసద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కార ణాలు, ఇతర వివరాలు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డిని అడిగి తెలుసు కున్నారు. ఆ భవనం నివాస యోగ్యమా, కాదా? అంటూ ప్రశ్నించారు. భవనం పటిష్టతను పరీక్షించాలని సూచించారు. ఆ కుటుంబీకులు ఎవరైనా మళ్లీ అదే భవనంలో ఉండటానికి ప్రయత్నిస్తే, జరగరానిది జరిగితే భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని నాగిరెడ్డి చెప్పారు.
చదవండి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లకు కారణాలు ఇవే.. ఇలా చేస్తే సేఫ్..