
పాత వైరింగ్.. సామర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు
ఒకే సాకెట్ నుంచి రెండు మూడు ఏసీలకు కనెక్షన్లు
ఓవర్ లోడు కారణంగా తలెత్తుతున్న షార్ట్ సర్క్యూట్‌లు
మొన్న అఫ్జల్‌గంజ్‌లోని మూడంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో..
నేడు గుల్జార్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లి నివాస భవనాల్లో అగ్ని ప్రమాదాలు
నిర్దేశిత లోడు కంటే ఎక్కువ కరెంట్‌ను వినియోగించడం.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంతర్గత కేబుళ్లను ఇప్పటికీ మార్చక పోవడం.. కేబుల్ సామర్థ్యానికి మించి ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం.. వైర్ల మధ్య జాయింట్లు ఎక్కువగా ఉండటం.. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తుతుండటం.. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, ఒవెన్‌లు, ఐరన్ బాక్సులు, కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు, లైట్లు రోజంతా ఆన్‌లోనే ఉంచడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు సంభవించడానికి ఇవే కారణాలు. వీటివల్లనే కేబుళ్లు హీటెక్కి, మీటర్, జాయింట్ల వద్ద నిప్పు రవ్వలు (స్పార్క్‌లు) చెలరేగుతున్నాయి. ఇలా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల ఫలితంగా మాల్స్, దుకాణాలు, ఇళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆస్తి నష్టం జరుగుతోంది.
కొన్ని ఘటనల్లో అగ్నికీలల్లో చిక్కు కోవడం, పొగతో ఊపిరాడకపోవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు లైన్లు, వైర్లు, ప్లగ్ లు, ఎంసీబీలు, ఎర్త్‌రాడ్‌ల పని తీరును పరిశీలించి, దెబ్బతిన్న కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చుకోవాల్సి ఉన్నా వాణిజ్య, గృహ వినియోగదా రులు పట్టించుకోవడం లేదు. పాతబస్తీలోని పురాతన భవనాల్లోనే కాకుండా, కొత్తగా సీఈఐజీ అనుమతి పొందిన హైరైజ్ భవనాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు (Short Circuit) జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పాతబస్తీ అయినా.. కొత్త హైరైజ్‌లైనా
పాతబస్తీలో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోనే కాదు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, నానక్‌రాంగూడల్లో కొత్తగా నిర్మించే హైరైజ్ బిల్డింగ్స్‌లోనూ విద్యుత్ లైన్లు సరిగా ఉండటం లేదు. భవిష్యత్తు అవసరాల మేరకు లోడు ఎంపిక మొదలు..లైన్ల ఏర్పాటు వరకు అన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆలోచనకు, అవసరాలకు భిన్నంగా ఆ తర్వాత ఇంట్లోకి అనేక విద్యుత్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో తక్కువ సామర్థ్యంతో లైన్లు, కేబుళ్లు వేయడం జరుగుతోంది.
నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కనీస అనుభవం, అర్హత లేని ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. వీరు భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలిక అవసరం కోసం లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఎంసీబీలు వాడుతున్నారు. కంటికి కన్పించే ప్లగ్‌లు, స్విచ్ బోర్డులు, లైట్లు మినహా గోడలు, స్లాబులో వాడే వైర్లు నాసిరకంగా ఉంటున్నాయి. సరైన ఎర్తింగ్ ఉండటం లేదు.
మరోవైపు ఒకే ప్లగ్/ వైరు నుంచి మల్టిపుల్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఒకే సాకెట్ నుంచి ఒకటికి మించిన ఏసీ కనెక్షన్లు ఉంటున్నాయి. ఇలా సామర్థ్యానికి మించి ఏసీలు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ ఎక్కువగా వినియోగించడం వల్ల బలహీనంగా ఉన్న కేబుళ్లు తట్టుకోలేకపోతున్నాయి. కేబుళ్ల జాయింట్ల వద్ద స్పార్క్‌లు చెలరేగుతున్నాయి.
పేలుతున్న ఏసీ కంప్రెషర్లు
ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించే ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు.. ప్రస్తుతం సాధారణ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి ఇందుకు దోహదపడుతోంది. ప్రతిఒక్కరూ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగినట్టుగా తయారీ కంపెనీలతో పాటు పలు బ్యాంకులు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాయి. వాయిదా పద్ధతుల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు కూడా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని చాలాచోట్ల 60 నుంచి 100 గజాల స్థలంలోనూ ఐదారు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు కింద షాపులను ఏర్పాటు చేసి, పైన నివాసానికి వీలుగా చిన్న చిన్న గదులను నిర్మిస్తున్నారు. నివాసితులు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఏసీలూ వినియోగిస్తున్నారు. ఒక ఇంట్లోనే రెండు, మూడు ఏసీలు ఉంటున్నాయి. అయితే ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు కూడా సరిగా ఉండటం లేదు. వైరింగ్ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి కరెంటు వాడటం, మండే ఎండల్లో రోజంతా ఏసీలు ఆన్‌లో ఉంటుండటం వల్ల కంప్రెషర్లు పేలిపోతున్నాయి.
బయటకు రాలేక, మంటల్లో చిక్కుకుని..
కిటికీ, డోర్ కర్టెన్లు, పరుపులు, దుస్తువులకు నిప్పు అంటుకుని వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లేందుకు ఇరుకైన దారి ఉండటం, తలుపులకు తాళాలు వేసి ఉండటం, ఇతరత్రా కారణాలతో బయటకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మొన్న అఫ్జల్‌గంజ్‌లోని మూడంతస్తుల భవనం, తాజాగా చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇలాంటి పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది.
ఇలా చేస్తే సేఫ్...
⇒ బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలనే భవనాల్లో ఉపయోగించాలి.
⇒ విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్‌తో మాత్రమే చేయించాలి.
⇒ అతుకుల తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదకరం.
⇒ విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్, ఓవెన్లను గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఉంచాలి.
⇒ అధిక ఓల్టేజీ ఉన్న ఉపకరణాలకు ఎర్తింగ్ ఉన్న 3 పిన్ సాకెట్లను వాడాలి.
⇒ ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ (Mobile Charging) బెడ్ దగ్గర పెట్టకూడదు.
⇒ విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే నీళ్లతో ఆర్పవద్దు. దీని వల్ల కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం కలగొచ్చు.
⇒ వెంటనే విద్యుత్‌ను ఆఫ్‌చేసి, పొడి ఇసుకతో లేదా కార్బన్ డయాక్సైడ్ ఎక్ట్సింగ్విషర్‌తో మంటలను ఆర్పాలి.
చదవండి: పాతబస్తీ ప్రమాదంలో విస్తుపొయే విషయాలు.. అక్రమ కనెక్షనే కారణమా?
⇒ ఎత్తయిన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపకశాఖ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి. హైడ్రెంట్లు, ఫైర్ ఎగ్జిట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటివి ఏర్పాటు చేయాలి.
⇒ ప్రతి అంతస్తులో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతపై సైన్ బోర్డులు ప్రదర్శించాలి. స్మోక్ అలారం (Smoke Alarm) ఏర్పాటు చేయడంతోపాటు ఏటా భద్రతా తనిఖీలు నిర్వహించాలి.
⇒ ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు ఉండాలి. మూడు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలి.
⇒ అగ్నిప్రమాదాలు జరిగితే కంగారుపడకుండా ఫైర్ అలారం మోగించి అప్రమత్తం చేయాలి. లిఫ్టులకు బదులు మెట్ల మార్గాన్ని వినియోగించాలి.
⇒ మంటలు ఎక్కువగా ఉన్న సమయంలో నడవకుండా ముఖానికి గుడ్డ కప్పుకొని, పాకుతూ అక్కడి నుంచి బయటికి రావాలి.
⇒ మంటల్లో చిక్కుకుంటే బిగ్గరగా అరుస్తూ, చేతి రుమాలును కిటికీ లేదా బాల్కనీ నుంచి ఊపుతూ బయట ఉన్న వాళ్లకు సమాచారం ఇవ్వాలి.