
అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడిన జనం
ఏకంగా 17 మంది మృత్యువాతతో సర్వత్రా ఆవేదన
మంటలు తీవ్రంగా అంటుకోకున్నా...దట్టమైన పొగతో అధిక ప్రాణనష్టం
ఆదమరచి నిద్రపోయిన ఆ కుటుంబ సభ్యులకు అదే శాశ్వత నిద్ర అని తెలియలేదు. రోజు మాదిరిగానే నిద్రపోయినా...రోజు మాదిరిగా నిద్ర లేవలేదు. ఎగసిన అగ్నికీలలు.. ఉక్కిరి బిక్కిరి చేసిన పొగతో నిద్ర నుంచి మేల్కొన్నా.. ఏం జరిగిందో తెలియక.. ఎటు వెళ్లాలో అర్థంకాక.. అంటుకున్న మంటలతో కాలిన గాయాలై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృత్యు ఒడికి చేరిపోయారు.
ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందడం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటల కంటే పొగపీల్చి ఎక్కువ మంది కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే అగ్నికి ఆహుతి అవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఒక అగ్నిప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం నగర చరిత్రలోనే మొదటిసారని తెలిసి.. ‘అయ్యో ఇలా జరిగిందేంటి’ అనుకుంటూ స్థానికులంతా సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహాలను తరలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీరుపెట్టారు.
రద్దీ పెరిగితే.. ముప్పు పెరిగేది!
సాక్షి, సిటీబ్యూరో: దివాన్ దేవిడీలోని మదీనా అండ్ అబ్బాస్ టవర్స్... దిల్‌సుఖ్‌నగర్‌లోని చందనా బ్రదర్స్... కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్... బషీర్‌బాగ్‌లోని మొఘల్ కోర్ట్‌లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ... నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా... పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్... ఇలా నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలిగాయి. పాతబస్తీలో ఆదివారం నాటి ‘మోదీ ఇంట్లో’ ఉదంతం కూడా తెల్లవారుజామున జరిగింది.
మరికొంత ఆలస్యంగా జరిగి ఉంటే చార్మినార్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జనసమర్థంగా మారేవి. రోడ్లన్నీ వాహనాలతో నిండేవి. ఒకవేళ రోడ్లు రద్దీగా ఉండే పగటి వేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే... నష్టం అపారంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఉండే రోడ్లు, నిర్మాణాలు, ట్రాఫిక్ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధంగా ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు లేకపోవడమే దీనికి కారణం. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
నిబంధనలు... వాస్తవాలు...
1. నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి 5 చదరపు కిమీలకు ఒక అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 15 నుంచి 20 చదరపు కిమీకి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి.
ప్రతి 50 వేల మంది రక్షణకు ఓ అగ్నిమాపకశకటం అవసరం. ఈ రకంగా చూస్తే గ్రేటర్‌లో కనీసం 250 ఫైర్ ఇంజన్లు అవసరం. ఇప్పుడు ఇందులో కనీసం సగం కూడా అందుబాటులో లేవు.
అగ్నిమాపక శకటం గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించగలగాలి. ఇటీవల విడుదలైన టామ్ టామ్ నివేదిక ప్రకారం చూసినా ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 నుంచి 25 కిమీ మించట్లేదు.
ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగ్నిమాపక శకటం అక్కడకు చేరాలి. అయితే ప్రస్తుతం నగర రోడ్ల పరిస్థితిని బట్టి రద్దీ వేళల్లో ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది.
బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్‌లోనే ఉంది. వీటికి తోడు అగ్నిమాపక శాకలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బంది ఉండనే ఉన్నాయి.
2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది.
ఈ రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్‌స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.
పేరులోనే ఫైర్!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అగ్నిమాపక సేవల చట్టం కోరల్లేని పాములాగా తయారైంది. తరచుగా భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉల్లంఘనదారుల్లో భయం కనిపించడంలేదు. ఈ చట్టం కింద అభియోగాలు నమోదు చేసే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఒకవేళ నేరం రుజువైనా పెద్దగా శిక్షలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలే ఉండటం ఇందుకు కారణం. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ వినియోగంలో ఉండటమే ప్రధాన కారణం.
పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తప్ప నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో అగ్ని మాపక సేవల చట్టం నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగి్నమాపక శాఖ ఏదైనా ఎస్టాబ్లిష్‌మెంట్ ఉల్లంఘనలు గుర్తించినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు నోటీసులు జారీ చేసి.. గడువిచ్చాక డీజీ అనుమతి మేరకు విచారణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి నివేదికను న్యాయస్థానంలో సమరి్పస్తారు. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత చాలా కేసులు సరైన ఆధారాల్లేక వీగిపోతుంటాయి. ఒకవేళ కేసు రుజువైనా అగ్నిమాపక సేవల చ ట్టం ప్రకారం పడే జరిమానా రూ.వేలల్లోనే ఉంటుంది.
శిక్షలు తక్కువే..
ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సరీ్వసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగి్నమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు.
ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అది ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లం ఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు లేకపోవడంతో ఉల్లంఘనదారుల్లో భయం లేదని అభిప్రాయం వెల్లడవుతుంది.
ఏళ్లుగా నిరీక్షణ..
తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్ని మాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌కు సంబంధించినవే ఉన్నాయి. గత దశాబ్ధ కాలలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది.
ఆకాశహార్మ్యాలు, వాణిజ్య భవనాలు కోకొల్లలుగా వెలిశాయి. ఈ స్థాయిలో అగ్నిమాపక శాఖ కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యంత్రాలు, రోబోలతో పాటు చట్ట సేవరణ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్నిమాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.