కంకరలో ఇరుక్కున్నాం
నరకం అనుభవించాం
ఎలాగోలా బయటపడ్డాం
భయానక ప్రయాణం
క్షతగాత్రుల ఆవేదన
చేవెళ్ల: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ప్రస్తుతం 13 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై వారిని కదిలించగా ఉబికివచ్చే కన్నీళ్లతో తమ అనుభవాలను పంచుకున్నారు. మృత్యువు అంచులవరకు వెళ్లి వచి్చనట్లుగా ఉందని, షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు.

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ
లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది. నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు.

తలచుకుంటేనే భయంగా ఉంది
బస్సు తాండూరులోనే నిండిపోయింది. ధారూరు, వికారాబాద్ వచ్చేసరికి సీట్లు లేక చాలామంది నిల్చున్నారు. ప్రమాదంలో నడుం వరకు కంకరలో కూరుకుపోయాను. నా కాలుకు రేకు దిగింది. రెండు ఫీట్లు ముందుండి ఉంటే ప్రాణాలు పోయేవి. బతికిపోయాను అనుకున్నా. తలచుకుంటేనే భయంగా ఉంది.
– బస్వరాజ్, కోకట్

ప్రాణాలు పోతాయనుకున్నా..
నగరంలో స్వీపర్‌గా పనిచేస్తాను. ధారూరు నుంచి రోజూ తాండూరు నుంచి వచ్చే మొదటి బస్సుకే వెళ్తుంటాను. సోమవారం కూడా ఎప్పటిలాగే బస్సు ఎక్కగా సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కనే ఉన్న బ్యానెట్‌పై కూర్చున్నా. మీర్జాగూడ గేట్ రాగానే మలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్‌ను చూసి లారీ వస్తుంది తమ్మి అని డ్రైవర్‌కు చెప్పా. డ్రైవర్ బస్సును పక్కకు మలిపేలోపు టిప్పర్ ఢీకొట్టింది. కంకరలో మొత్తం మునిగిపోయా. నా చేయి మాత్రమే పైకి ఉండిపోయింది. తోటి ప్రయాణికులు నా చేయి పట్టుకొని బయటకు తీశారు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనుకున్నా. తీవ్ర గాయాలతో బతికిబయటపడ్డా.
– నాగమణి, ధారూరు
రైలు మిస్సు కావడంతో..
హైదరాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాను. వీక్లీ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. ఎప్పుడు వచి్చనా రైలుకు వెళ్తాను. సోమవారం ఉదయం 4.30కు రైలు మిస్ కావడంతో 4.40 గంటలకు తాండూరు నుంచి వెళ్లే మొదటి బస్సు ఎక్కాను. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేశాడు. కానీ టిప్పర్ డ్రైవర్ వచ్చి ఢీకొట్టాడు. నిలబడి ఉన్న నేను కంకరలో ఇరుక్కుపోయాను. నా ముందు ఒకతని ప్రాణాలు పోయాయి. జేసీబీ వచ్చే వరకు బయటకు రాలేకపోయా. ఇలా ఆస్పత్రి పాలవుతాననుకోలేదు.
– బి.శ్రీనివాస్, తాండూరు
కంకరలో కూరుకుపోయా..
మన్నెగూడ నుంచి చేవెళ్లలో ఆస్పత్రికి చూపించుకునేందుకని బస్సు ఎక్కాను. బస్సు నిండిపోవడంతో నిలబడి ఉన్నా. కంకరలో సగం వరకు కూరుకుపోయా. డోర్‌కు దగ్గరలో ఉండడంతో స్థానికులు రెండు చేతులు పట్టి బయటకు లాగారు. లేదంటే ప్రాణాలు పోయేవి. రోడ్డు బాగాలేకే ఈ ప్రమాదం జరిగింది. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఈ ప్రమాదంతో మరింతగా బాధపడుతున్నాను.
– అనసూయ, బోంగుపల్లి

ఏం జరిగిందో అర్థం కాలేదు
వికారాబాద్‌లో ఉంటూ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిస్తున్నాను. వారానికి ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్తాను. ఆదివారం వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్నాను. బస్సులో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచి్చంది. తరువాత చూస్తే అంతా దుమ్ము, కంకర. అందులో పడిన వారి అరుపులు వినిపించాయి. నాకు ముక్కుకు, తలకు కంకర తగిలి గాయలయ్యాయి.
– ఆర్.అఖిల్, పూడూరు


