లోక్ అదాలత్‌లో 95 కేసులకు పరిష్కారం
తాండూరు: పట్టణంలోని న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివలీల ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్‌కు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నుంచి మొత్తం 95 కేసులు వచ్చాయి. ప్రిన్సిపల్ జేసీజే కోర్టుకు 78 కేసులు, అడిషనల్ జేసీజే కోర్టుకు 4, సైబర్ క్రైమ్ కేసులు 13 కేసులు న్యాయమూర్తి ముందుకు వచ్చాయి. ఈ కేసులను కొట్టి వేసి అర్జీదారులకు కక్షిదారులకు శాశ్వత పరిష్కారం కల్పించారు. కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్ సభ్యులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
తాండూరు రూరల్: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. చిట్టిఘనాపూర్, చంద్రవంచ గ్రామ శివారులో కాగ్నా నది నుంచి అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తాండూరు పట్టణానికి తరలిస్తున్నారు. ఇదంతా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా చిట్టిఘనాపూర్ కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తాండూరుకు తరలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు బెల్కటూర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కరన్‌కోట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వినోద్ రాథోడ్ తెలిపారు. త్వరలో చంద్రవంచలో ఇసుక అక్రమ రవాణాను అరికడతామని ఎస్‌ఐ చెప్పారు.
28న దివ్యాంగుల సమావేశం
అబ్దుల్లాపూర్‌మెట్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డికి తెలంగాణ ప్రతిభావంతుల వికలాంగుల సేవా సంఘం సభ్యులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 28న సంఘం తరఫున కుంట్లూరు డివిజన్ రాజీవ్‌గృహకల్పలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఎంపీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి.రాంచంద్రయ్య, సభ్యులు గ్యార మహేశ్, గొల్ల పాండు తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
షాద్‌నగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జగన్(38) వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్‌కు వచ్చారు. పట్టణంలోని ముఖ్య కూడలి మీదుగా మహబూబ్‌నగర్ రోడ్డు వైపు వెళుతుండగా లావణ్య బార్ ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో వాహనం జగన్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు జిల్లా ఫైర్ అధికారి– 2 బి.కేశవులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి గతంలో కలెక్టర్ 900 గజాల స్థలాన్ని సరూర్‌నగర్‌లో మంజూరు చేశారని అన్నారు. నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సరూర్‌నగర్, బాలాపూర్ ప్రజల సౌకర్యార్థం రెండేళ్ల క్రితం ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
లోక్ అదాలత్‌లో 95 కేసులకు పరిష్కారం
లోక్ అదాలత్‌లో 95 కేసులకు పరిష్కారం


