లోడర్ కిందపడి కార్మికుడి మృతి
బొంరాస్‌పేట: మండలంలోని చౌదర్‌పల్లి శివారులో గల శ్రీ సాయి లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం రాత్రి కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బృంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖాషీంపాషా(29) పదిహేనేళ్లుగా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి కంకర నింపుతున్న క్రమంలో లోడర్ కిందపడి చనిపోయాడు. శరీరంలోని సగభాగం పూర్తిగా దెబ్బతింది. పరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యన మృతిచెందాడు. మృతదేహాన్ని కొడంగల్ మార్చురిలో ఉంచారు. మృతుడికి భార్య గౌసియాబేగం, ఐదేళ్ల కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
కొడంగల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నీటూర్ గేటు సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ పట్టణానికి చెందిన వెంకటేశ్(33)కు ఇటీవల వివాహం జరిగింది. అత్తగారిల్లు కర్ణాటక రాష్ట్రంలోని బూర్గుపల్లి గ్రామానికి హైదరాబాద్ నుంచి బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని నీటూర్ గ్రామ గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్ పై నుంచి లారీ వెళ్లడంతో శరీరభాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. గమనించిన పరిసరవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సంబంధీకుల ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు
కొంపల్లి అనంతరెడ్డి
మొయినాబాద్‌రూరల్: సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాశీంబౌలిలో సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన నాయకులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముదిగొండ రవియాదవ్, కాశీంబౌలి సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, పరమేశ్, చిన్న పాల్గొన్నారు.


