ముహూర్తానికి వేళాయే
● నేడు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం
● ప్రత్యేక సమావేశంతో కొలువు దీరనున్న పాలకవర్గం
● త్వరలోనే శిక్షణ తరగతులు
మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేకాధికారులు వారితో ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగిస్తారు. ఆ వెంటనే కొత్త పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. దీని కోసం గ్రామ సచివాలయాలు ముస్తాబయ్యాయి.
బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు 22 నెలలుగా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనకు నేటితో తెరపడనుంది. మండలంలోని 39 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీర బోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22ను అపాయింట్‌మెంట్ డేగా ప్రకటించింది. దీంతో పంచాయతీరాజ్ అధికారులు కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతూ వచ్చింది. అయితే సోమవారంతో పాలనా పగ్గాలు కొత్త సర్పంచుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన మొదటి సమావేశం జరుగుతుంది. మరోవైపు నూతన సర్పంచులకు, ఉప సర్పంచులకు ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
ముస్తాబైన జీపీలు
దోమ: మండల వ్యాప్తంగా మొత్తం 36 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటిని ఎన్నికలు నిర్వహించగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం వారి ప్రమాణ స్వీకారం జరగనుండగా, ఆయా జీపీలకు పంచాయతీ కార్యదర్శులు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు.
గూడులేని పంచాయతీలు!
మండలంలో కాశీంపూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, గొట్టిగఖుర్ధు, నవల్గా, నీళ్లపల్లి, కొర్విచెడ్, బసీరాబాద్, మైల్వార్, ఎక్మాయి, మంతన్‌గౌడ్‌తండా, జీవన్గీ జీపీలకు సొంత భవనాలున్నాయి. తొమ్మిది జీపీలు మల్కన్‌గిరి, బాద్లాపూర్, బాద్లాపూర్‌తండా, కంసాన్‌పల్లి(బి), బోజ్యానాయక్‌తండా, హంక్యానాయక్తండా, పర్శానాయక్తండా, గంగ్వార్, నంద్యనాయక్‌తండాలలో భవనాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు, అద్దె ఇళ్లల్లో తాత్కాలికంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఇస్మాయిల్‌పూర్, జలాల్‌పూర్, పర్వత్‌పల్లి, మర్పల్లి, బాబునాయక్‌తండా, ఇందర్‌చెడ్, క్యాద్గీరా, మాసన్‌పల్లి, కొత్లాపూర్, వాల్యానాయక్‌తండా, గొట్టిగఖుర్ధు పంచాయతీలకు కొత్త భవనాలున్నాయి. ఇవి కూడా ప్రారంభం కాకపోవడంతో అంగన్‌వాడీ, అద్దె ఇళ్లల్లో కొనసాగనున్నాయి.
ముహూర్తానికి వేళాయే


