అతివేగంగా వెళ్తున్న డీసీఎం బోల్తా
పరిగి: మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ వైపు నుంచి సోమన్‌గుర్తి స్టీల్ ఫ్యాక్టరీకి స్క్రాప్ లోడ్‌తో అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న డీసీఎం బహార్‌పేట్ మూల మలుపున చికెన్‌సెంటర్ ఎదుట బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ఆటో, బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న చిన్నారి త్రుటిలో తప్పించుకుంది. జాలి కిందికి వెళ్లిన చిన్నారిని స్థానికులు వెంటనే స్పందించి రక్షించారు. రోడ్డు ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడటంతో గంటకుపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


