కండరాలకూ జ్ఞాపకాలు! | Muscles have their own intelligent memories | Sakshi
Sakshi News home page

కండరాలకూ జ్ఞాపకాలు!

Oct 31 2025 5:14 AM | Updated on Oct 31 2025 5:14 AM

Muscles have their own intelligent memories

కండరాలను ఎంత ఉపయోగిస్తే అంత ప్రయోజనం

‘ప్రతికూల జ్ఞాపకాల’తో పట్టు సడలే అవకాశం

తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మాటలు వినగానే.. అవి మన మెదడు సొత్తే అనుకుంటాం. కానీ, మన శరీరం అంతటా అల్లుకొని ఉండే కండరాలకు కూడా సొంత తెలివితేటలు, జ్ఞాపకాలు ఉంటా యట. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు గానీ, వాస్తవం. అంతెందుకు..? వ్యాయామం చేస్తే కండరాలు బలంగా పెరుగుతాయని మనకు తెలుసు. 

అయితే, మానేసిన కొన్నాళ్లకు ఆ విషయాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ, కండరాలు మాత్రం మర్చిపోవట. మళ్లీ కొన్నేళ్ల తర్వాత తిరిగి మొదలు పెట్టినా, మన కండరాలు గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని అధ్యయనాల్లో తేలింది.     – సాక్షి, సాగుబడి

కండరాలకూ సొంత తెలివితేటలతో కూడిన జ్ఞాపకాలుంటాయట. మీరు కండరాలను ఎంతగా ఉపయోగిస్తే, అవి మీ శరీరానికి అంత ఎక్కువ శాశ్వత ప్రయోజనకరమైన వనరుగా మారుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సైకిల్‌ తొక్కేట ప్పుడు శరీరంలో కండరాలు కలిసికట్టుగా సమన్వయంతో కదలటం నేర్చుకుంటాయి. ఆ చలనశీలతను చిరకాలం పాటు గుర్తుపెట్టుకుంటాయి. 

జ్ఞాపకాలతో మరింత వేగంగా!
కండరాల ఎపిజెనెటిక్‌ జ్ఞాపకశక్తిపై షార్పుల్స్‌ విశేష పరిశోధనలు చేశారు. ప్రవర్తన, పరిస్థితుల ప్రభావం వల్ల జన్యు వ్యక్తీకరణలో వచ్చే మార్పులను ఎపిజెనెటిక్‌ మార్పులు అంటారు. అంటే, జన్యువులు మారవు, కానీ అవి పనిచేసే విధానం మారుతుంది. 

వ్యాయామంతో కలిగే జన్యు వ్యక్తీకరణ మార్పులకు సంబంధించిన జ్ఞాపకాలను కండరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయని షార్పుల్స్‌ పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని నెలలు లేదా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వ్యాయామం ప్రారంభించినప్పుడు పాత జ్ఞాపకాల ఆధారంగా మొదట్లో కన్నా వేగంగా కండరాలు బలం పుంజుకుంటాయని ఆయన కనుగొన్నారు. 

చప్పున గుర్తుతెచ్చుకుంటాయి
మన కండరాల్లోని కణాలు.. శరీర కదలికలను, వ్యాయామాన్ని కలకాలం గుర్తుపెట్టుకోగలవు. అవసరమైనప్పుడు వాటిని మళ్లీ చప్పున గుర్తుతెచ్చుకోవటమే కాకుండా మొదట్లో కన్నా చప్పున స్పందించగలవని ఇటీవల వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. ‘మానవ శరీరంలో అవయవాల చుట్టూ ఉండే కండరాల్లోని కణాలు విలక్షణమైనవి. అవి పొడవుగా, పల్చగా, పోగుల మాదిరిగా ఉంటాయి. 

నిద్రాణంగా ఉండే ఈ మూల కణాలు శరీర కదలికలు/వ్యాయామం వల్ల వత్తిడి కలిగినప్పుడు లేదా గాయం తగిలినప్పుడు చైతన్యవంతమై కండర వృద్ధికి దోహదపడతాయి. చాలా ఏళ్ల తర్వాత మనం మళ్లీ వ్యాయామం చేసినా గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని మా పరిశోధనల్లో తేలింది’ అంటారు కండర శాస్త్రవేత్త డా. ఆడమ్‌ షార్పుల్స్‌. ఆయన ఓస్లోలోని నార్వేజియన్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

ప్రతికూల జ్ఞాపకాలు!
కండర కణాలు అన్ని వేళలా ‘సానుకూల జ్ఞాపకాల’తోనే స్పందించాలనేం లేదు. ఒక్కోసారి ‘ప్రతికూల జ్ఞాపకాల’తోనూ ప్రతిస్పందించవచ్చు. ప్రతికూలతకు వ్యాధి కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు.. పదేళ్ల క్రితం రొమ్ము కేన్సర్‌కు చికిత్స పొందిన మహిళల్లో కండరాలు ‘ప్రతికూల జ్ఞాపకాల’ వల్ల వారి వయసుకు మించి పట్టు సడలి,  క్షీణించటాన్ని షార్పుల్స్‌ గుర్తించారు. 

వారితో ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులు చేయించినప్పుడు కండరాలు వయసుకు తగిన రీతిలో పున రుజ్జీవనం పొంది పటుత్వం పెంచుకోగలిగాయి. ప్రతికూల జ్ఞాపకాలపై సానుకూల జ్ఞాపకాలు పైచేయి సాధించటం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement