
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్నిప్రమాదం వెనక అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం కారణంగా 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్ కనెక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్‌తో బాధిత కుటుంబం కరెంట్ మీటర్‌పై లోడ్ పడింది. ఆ కరెంట్ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ఉడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా. గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెనువిషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు.