
ఆరువేల ఏళ్ల క్రితంఅంతరించిన స్టెగొడాన్‌జాతి ఏనుగులు
నాలుగేళ్ల క్రితం వాటిదంతాల శిలాజాలు గుర్తించిన సింగరేణి
తాజాగా బిర్లా సైన్స్‌సెంటర్ మ్యూజియంలో ప్రదర్శన
దంతాలు దొరికిన చోట ఏనుగు శిలాజం కోసం అన్వేషణకు పురావస్తు శాఖ సిద్ధం
సింగరేణి సంస్థ సహకారంతో త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్వేషణ
స్టెగొడాన్..
ఒకప్పుడు భూమిపై సంచరించిన రాకాసి ఏనుగుల జాతి ఇది. ఇవి దాదాపు ఆరు వేల ఏళ్ల క్రితం అంతరించాయి. నాలుగేళ్ల క్రితం మన రాష్ట్రంలో 8 అడుగుల పొడవైన ఈ ఏనుగు దంతాల శిలాజాలను కనుగొన్నారు. దంతాలు దొరికిన చోట అన్వేషిస్తే ఏనుగు శిలాజం కూడా దొరకవచ్చు కదా అనే ఆసక్తితో పురావస్తు శాఖ తవ్వకాలకు సిద్ధమవుతోంది. స్టెగొడాన్ ఏనుగులు ఇప్పుడున్న ఏనుగులతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేవి. దాదాపు 13 అడుగుల ఎత్తు, 13 టన్నులకుపైగా బరువు ఉండే భారీ జీవిలివి. 11 మిలియన్ సంవత్సరాల నుంచి 6 వేల ఏళ్ల క్రితం వరకు భూమిపై ఇవి మనుగడ సాగించాయి.
వాతావరణ మార్పుల ప్రభావంతో క్రమంగా అంతరించిపోయాయి. ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో చివరకు 6 వేల ఏళ్ల క్రితం జీవించి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుత రామగుండం పరిసర ప్రాంతాలు కూడా ఒకప్పుడు వాటి ఆవాసాలే. ఈ ప్రాంతంలో అవి విస్తారంగా తిరిగినట్టు నాలుగేళ్ల క్రితం జాడలు వెలుగు చూశాయి. అప్పట్లో రామగుండం భూ ఉపరితల గనుల్లో మేడిపల్లి ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా కొన్ని శిలాజాల (ఫాసిల్స్)ను గుర్తించారు.
వాటిని నిపుణుల దృష్టికి తీసుకెళ్లగా... అవి స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలుగా తేల్చారు. ఆ ముక్కలు రెండు ఏనుగులకు చెందిన రెండు జతల దంతాలుగా గుర్తించి వాటిని సేకరించారు. వాటిల్లో రెండు దంతాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సాయంతో అతికించి పూర్తిస్థాయి దంతాల రూపు కల్పించారు. ఆ జాతి ఏనుగుల దంతాలు 12 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇక్కడ గుర్తించిన దంతాల పొడవు దాదాపు 8 అడుగులు ఉంది.
ఏనుగు కోసం అన్వేషణ..
జీపీ బిర్లా ఆర్కియోలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయరెడ్డి బృందం సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ రెండు దంతాలను తెచ్చి బిర్లా సైన్స్ సెంటర్‌లోని డైనోసార్ శిలాజం ఉన్న మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మరో రెండు దంతాల ముక్కలను సింగరేణి అధికారులు హైదరాబాద్‌లోని జూపార్కుకు అందజేశారు.
ఈ విషయం తెలిసి తెలంగాణ వారసత్వ (పురావస్తు శాఖ) శాఖ డైరెక్టర్ అర్జునరావు కొద్ది రోజుల క్రితం సింగరేణి సీఎండీ బలరామ్‌ను కలిసి వాటిని తమకే అప్పగించాలని కోరారు. ఆ ప్రాంతంలో తాము శిలాజాలను అన్వేషించేందుకు సహకరించాలని కోరగా, బలరామ్ అంగీకరించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని యామనపల్లి ప్రాంతంలో డైనోసార్ శిలాజాలు లభించాయి.
మరిన్నిశిలాజాలను సేకరిస్తాం
కొత్తగా బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలను సగటున రోజుకు మూడున్నర వేల మంది వీక్షిస్తున్నారు. వీటికి మంచిఆదరణ వస్తోంది. దీంతో మరిన్ని శిలాజాలను సేకరించి ప్రదర్శనకుఉంచాలని నిర్ణయించాం. సింగరేణి సంస్థతోసంప్రదింపులుజరుపుతున్నాం. ఇతరుల వద్ద శిలాజాలు ఉన్నాసేకరించి ప్రదర్శనకుఉంచుతాం. -డా.మృత్యుంజయరెడ్డిజీపీ బిర్లా ఆర్కియోలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్.
శిలాజాలను గుర్తించి జనం ముందుకు తెస్తాం
వేలు, లక్షల ఏళ్ల నాడు అంతరించిన జంతువులు భూగర్భంలో శిలాజాలుగా మారి అనవాళ్లుగా ఉన్నాయి. వాటిని వెలికి తీసి ప్రజల ముందుకు తేవాలన్నది మా ప్రయత్నం. గతంలో సింగరేణి సంస్థకు స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలు లభించిన చోట అన్వేషిస్తే ఆ ఏనుగుల అవశేష శిలాజాలు దొరికే వీలుంది. వాటితోపాటు ఇతర అరుదైన జీవజాతుల శిలాజాలను కూడా వెలుగులోకి తెస్తాం. మరో రెండు రోజుల్లో మా ఇద్దరు అధికారులు రామగుండంలోని మేడిపల్లికి వెళ్లి సింగరేణి నిపుణులతో కలిసి రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తారు. ఆ తర్వాత తవ్వకాలు జరిపి అన్వేషిస్తాం. -అర్జునరావు తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్
శిలాజాలు విస్తారంగా దొరుకుతున్నాయి
ఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తారంగా జీవజాతుల శిలాజాలు వెలుగుచూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం మేంగుర్తించిన స్టెగొడాన్ జాతి ఏనుగుదంత శిలాజాలను బీఎం బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మాకు లభించే శిలాజాలను జనంఎక్కువ మంది చూడగలిగే చోటఉంచేందుకు అందజేస్తాం. త్వరలోకొన్ని శిలాజాలను అటు పురావస్తు శాఖకు, బిర్లా సైన్స్ సెంటర్‌కుఇవ్వనున్నాం. -శ్రీనివాసరావు సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ జీఎం
-సాక్షి, హైదరాబాద్