
గాలి, నీరు తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది ఆహారం. ప్రతి ఒక్కరికీ తగిన ఆహారం తీసుకునే హక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆహారం, జీవితం, స్వేచ్ఛ, పని, విద్య తదితర హక్కులు ఉండాల్సిందే. వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటు, భద్రతతో కూడిన పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలి. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ నిర్వహిస్తోంది.
ఎలా మొదలయ్యింది?
ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)1945, అక్టోబర్ 16న స్థాపితమయ్యింది. దీనికి గుర్తుగా ఇదే రోజున ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి తదితర సంస్థలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ ఏడాది జరుపుకునే ప్రపంచ ఆహార దినోత్సవం థీమ్ ‘మెరుగైన ఆహారాలు, మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం’. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. పేదరికం, యుద్ధ సంఘర్షణలు, వాతావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యంతో ఎఫ్‌ఏఓ పనిచేస్తోంది.

ఆందోళన కలిగిస్తున్న ఆహార వ్యర్థాలు
ప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో మూడింట ఒక వంతు వృథా అవుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తయిన ఆహారంలో 19 శాతం వృథా అయినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కగట్టారు. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదిక వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2019లో 17శాతం ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి రెండు శాతం పెరిగి 19శాతాని కి చేరినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60 శాతం గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28శాతం ఉన్నట్లు తెలిపింది. మిగిలిన 12 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తేలింది. భారతదేశంలో ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఆహార వృథాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి.

ఆకలితో కోట్లాదిమంది విలవిల
ఆహార వృథా పరిస్థితి సంగతి అలా ఉంటే.. నేటికీ కనీసం తీనేందుకు గుప్పెడు అన్నం లేక కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. రోజంతా పస్తులుండే వారు కొందరైతే, ఒక పూట మాత్రమే తినే స్థితిలో అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 78.3కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ మోస్తరు ఆకలి బాధను అనుభవిస్తున్నారు. 2022లో 240కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. తెలిపింది. 78.3కోట్ల మంది ఆకలితో అలమటించగా, 14.8కోట్ల మంది పిల్లల్లో పోషహాకార లోపం కనిపించినట్లు తేలింది. తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో 25శాతం ఇండియాలోనే ఉన్నారన్నది గమనార్హం. భారత దేశ జనాభాలో 14.5శాతం మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ హెచ్చరించింది.
వాతావరణ మార్పులతో కుంగుబాటు
ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులు, జీవన ప్రమాణాల కారణంగా క్రమంగా వ్యవపాయ సాగుబడి తగ్గిపోతుంది. పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు పట్టణీకరణ కారణంగా వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం గణనీయంగా కుంచించుకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార వృథాను అరికట్టడం ఎంతో అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలూ బాధ్యతాయుతంగా మెలగాలి. గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. మరోవైపు ఆహార వ్యర్థాలు వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో ఆహారం కుళ్లిపోవడం కారణంగా గ్రీన్‌హౌస్ వాయువు మీథేన్ విడుదలవుతుంది. ఇది హానికారకంగా మారుతుంది. ఆకలిని పరిష్కరించడం అంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు నూతన విధానాలు అవలంబించాలనే విషయాన్ని ప్రపంచ ఆహార దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది.