
ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా
ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచన
వాతావరణ సంబంధిత ఆరోగ్య రిస్క్‌లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.131 లక్షల కోట్లు) మేర ఉత్పాదక నష్టం వచ్చే 25 ఏళ్లలో ఎదురవుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. అరోగ్య సమస్యలు పెరుగుతుండడం కీలక రంగాల్లో కార్మికుల కొరతకు కారణమవుతుందని పేర్కొంది.
ఆహారం, వ్యవసాయం, పర్యావరణం–నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, బీమా రంగాల్లో వాతావరణ మార్పుల కారణంగా పడే ప్రభావాన్ని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలసి డబ్ల్యూఈఎఫ్ అధ్యయనం చేసింది. రూ.131 లక్షల కోట్ల ప్రభావం అన్నది మొదటి మూడు రంగాలపై మధ్యస్తంగా పడే ప్రభావంతో వేసిన అంచనా అని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ భారం మరింత ఎక్కువగా ఉండొచ్చని డబ్ల్యూఈఎఫ్ నివేదిక తెలిపింది. కనుక కంపెనీలు తమ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చురుగ్గా స్పందించాలని, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు, ఉత్పాదకతకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వాతావరణ మార్పులతో తీవ్రమైన వేడి పరిస్థితులు, ఇన్ఫెక్షన్ల తీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల రిస్క్ పెరుగుతుందని అంచనా వేసింది. ‘వ్యాపార కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు, దీర్ఘకాలం పాటు బలంగా నిలబడేందుకు వీలుగా సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన దశకంలోకి ప్రవేశించాం. ఉద్యోగుల ఆరోగ్యం పరిరక్షణ, ఉత్పాదకత రిస్క్‌లు, వ్యయాలు పెరుగుతున్నాయి’ అని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.
ఆహార భద్రతకు రిస్క్
ఆహారం, వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పుల ఫలితంగా 740 బిలియన్ డాలర్ల మేర ఉత్పాదక నష్టం ఏర్పడుతుందన్నది డబ్ల్యూఈఎఫ్ అంచనా. దీంతో ప్రపంచ ఆహార భద్రతకు రిస్క్ ఏర్పడుతుందని పేర్కొంది. పర్యావరణం–నిర్మాణ రంగంలో 570 బిలియన్ డాలర్ల ఉత్పాదకతన నష్టం వాటిల్లుతుందని తెలిపింది. వాతావరణ మార్పుల ఫలితంగా బీమా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఆరోగ్య క్లెయిమ్‌లు ఎదుర్కోవాల్సి రావచ్చొని అంచనా వేసింది. ‘‘ఉష్ణోగత్రలు పెరిగితే లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. లేదా తగ్గిపోవచ్చు. దీంతో కుటుంబాలు పేదరికంలోకి వెళతాయి. ఇది ప్రజల మనుగడకు ముప్పుగా మారుతుంది’’అని ఈ అధ్యయానికి సహకరించిన రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి: ఈ-పాస్‌పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..
వాతావరణ మార్పుల ఫలితంగా ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అధిగమించేందుకు ముందస్తు పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. అలాగే, సవాళ్లకు తగిన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ప్రతీ రంగం భిన్నమైన స్థితిలో ఉన్నట్టు పేర్కొంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే పంటల రకాలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలిచే ఔషధాల అభివృద్ధి, నిర్మాణ రంగ కార్మికుల భద్రత దృష్ట్యా శీతల పరిష్కారాలు, వాతావరణ మార్పుల షాక్‌ల నుంచి రక్షించే బీమా నమూనాల అవసరాన్ని ప్రస్తావించింది.