డైట్ సోడా సైతం సురక్షితం కాదు
కాలేయ సమస్యలకు దారితీస్తోంది
తాజా అధ్యయనంలో వెల్లడైన వాస్తవం
భోజనం, స్నాక్స్ సమయంలో సోడా ఒక ప్రధాన ఆహారంగా మారింది. మితంగా సోడా తీసుకోవడం కూడా కాలేయ ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజూ డైట్ సోడా లేదా చక్కెరతో తయారైన పానీయాలు తాగడం వల్ల నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) ప్రమాదం పొంచి ఉందని తేలింది. చక్కెరతో తయారైన తీపి పానీయాలు (ఎస్‌ఎస్‌బీలు), తక్కువ చక్కెర లేదా చక్కెరరహిత తీపి పానీయాలు (ఎల్‌ఎన్‌ఎస్‌ఎస్‌బీ) రెండూ కూడా జీవక్రియను దెబ్బతీస్తాయి.
తద్వారా మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్‌ఎల్‌డీ) అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. ఎంఏఎస్‌ఎల్‌డీని గతంలో వైద్యులు ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ అని పిలిచేవారు. రోజూ ఒక బాటిల్ డైట్ సోడా/కృత్రిమ చక్కెరతో తయారైన పానీయాలు తాగడం వల్ల ఎంఏఎస్‌ఎల్‌డీ ప్రమాదం 60% పెరుగుతుంది. అలాగే చక్కెర పానీయాల విషయంలో ఈ వ్యాధి ముప్పు 50% అధికం అవుతుందని అధ్యయనంలో తేలింది.
లక్ష మందికిపైగా..
జీవ సంబంధమైన, ఆరోగ్యం, జీవనశైలి సమాచారాన్ని సేకరిస్తున్న యూకే బయోబ్యాంక్ డేటా ఆధారంగా... దశాబ్ద కాలంలో 1,23,788 మందిపై ఈ పరిశోధన సాగించారు. పరిశోధన ప్రారంభంలో ఎవరికీ కాలేయ వ్యాధి లేదు. సమగ్ర ఆహార సంబంధ ప్రశ్నావళి ఉపయోగించి పరిశోధకులు పానీయాల వినియోగంతో మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్‌కు ఉన్న సంబంధాన్ని పరిశీలించారు.
నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. సిర్రోసిస్ లేదా కాలేయ కేన్సర్‌కు కూడా కారణమవుతుంది. అధికంగా ఆల్కహాల్ తాగేవారిలో ఎంఏఎస్‌ఎల్‌డీ సాధారణంగా వచ్చే సమ స్య. అమెరికాలో గత 30 సంవత్సరాల్లో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ బాధితుల సంఖ్య దాదాపు 50% పెరిగింది. ప్రస్తుతం అక్కడి జనాభాలో దాదాపు 38% మంది ఈ వ్యాధిబారిన పడ్డట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
అపోహ వీడండి..
చైనా సుజోలోని సూచో విశ్వవిద్యాలయానికి చెందిన అనుబంధ ఆసుపత్రి గ్రాడ్యుయేట్ విద్యారి్థ, ప్రధాన అధ్యయన రచయిత లిహే లియు ఆశ్చర్యకరమైన ఫలితాలను వివరించారు. ‘చక్కెర ఆధారిత తీపి పానీయాలపై చాలాకాలంగా అధ్యయనం జరుగుతోంది. అయితే డైట్ పానీయాలు ఆరోగ్యకరమైనవిగా జనం పరిగణిస్తున్నారు. ఇవి ఎంత మాత్రమూ సురక్షితం కాదు. మా అధ్యయనం ప్రకారం తక్కువ లేదా చక్కెర రహిత తీపి పానీయాలు రోజుకు ఒకే డబ్బా తీసుకున్నప్పటికీ మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని తేలింది. డైట్ సోడాలు తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధితో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది’అని అన్నారు.
నీటిని స్వీకరించడం వల్ల..
చక్కెర లేదా డైట్ సోడాలకు బదులుగా మంచి నీటిని స్వీకరించడం వల్ల ఫలితాలు మారిపోయాయి. సోడాలకు బదులుగా నీరు తీసుకోవడం వల్ల వ్యాధి వచ్చే అవకాశం దాదాపు 13% తగ్గింది. డైట్ పానీయాల విషయంలో 15% కంటే ఎక్కువ తగ్గింది. అయితే చక్కెర పానీయాలకు బదులుగా డైట్ పానీయాలు, అలాగే డైట్ పానీయాలకు బదులుగా చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించలేదని పరిశోధనలో తేలింది. ‘నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మొత్తం జీవక్రియ పనితీరుకు సాయపడుతుంది. అందుకే నీరు ఆరోగ్యకరమైన పానీయం’అని లియు తెలిపారు.
కాలేయంలో కొవ్వు
‘చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర పెరుగుదలను ప్రేరేపించడం, ఇన్సులిన్ స్థాయిలను పెంచడం, కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలేయానికి హాని కలిగిస్తాయి. చక్కెర పానీయాల్లో అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అధిక చక్కెరతో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. డైట్ సోడాలు తక్కువ కేలరీలు కలిగి ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు’అని లియు వివరించారు. చక్కెరతో తయారైన, తక్కువ లేదా చక్కెర రహిత తీపి పానీయాలు పేగుల్లోని సూక్ష్మజీవుల సమూహాన్ని (గట్ మైక్రోబయోమ్) మార్చగలవు. కడుపు నిండిన భావనకు అంతరాయం కలిగిస్తాయి. తీపి ఆహారాల పట్ల ఆసక్తి పెంచుతాయి. ఇన్సులిన్ స్రావాన్ని కూడా ప్రేరేపిస్తాయని నివేదిక వివరించింది.


