బీజేపీలో రామచంద్ర చేరిక వాయిదా

Ramachandra Raja Narasimha Postponed To Join In BJP Party - Sakshi

అనుచరులు, కార్యకర్తలతో బీజేపీ కార్యాలయానికి చేరుకున్న రాజనర్సింహ 

చివరి క్షణంలో రెండు రోజుల తర్వాత నిర్ణయమన్న పార్టీ నేతలు 

బాబూమోహన్‌ అభ్యంతరంతోనేనా?  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో చేరికలు పూర్తిస్థాయిలో పుంజుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి వివిధస్థాయిల నాయకులు చేరేందుకు ముందుకొస్తున్నా కొన్నిచోట్ల బీజేపీ నేతలే అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్‌నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రామచంద్ర రాజనర్సింహ పార్టీలో చేరాలనుకొంటే ఇలాంటి అనుభవమే ఎదురైంది.

గురువారం బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకోవడంతో పాటు తమ సన్నిహితులు, అనుచరులతో ఆయన జహీరాబాద్‌ నుంచి బీజేపీ ఆఫీసుకు వచ్చారు. ఈ చేరికకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా పార్టీ కార్యాలయం బయట ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌నుయ్‌ను కూడా కలుసుకున్నారు. అయితే ఈ చేరికపై బీజేపీనేత, మాజీ మంత్రి బాబూమోహన్‌ అభ్యంతరం తెలపడంతో ఇది వాయిదా పడ్డట్టు సమాచారం. రెండు, మూడురోజుల తర్వాత స్థానిక పార్టీ నేతలతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నాయకులు చెప్పినట్టు తెలిసింది.

ఆంథోల్‌ వద్దంటే వద్దని చెప్పినా... 
తాను ఆంథోల్‌ నుంచి పోటీ చేయనని కాగితం రాసి ఇచ్చేందుకు కూడా సిద్ధమని రామచంద్ర చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీకి చేసుకున్న దరఖాస్తులో జహీరాబాద్‌ లేదా చేవేళ్ల నుంచి పోటీకి అవకాశం కల్పించాలని ఆయన కోరినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే..గతంలో దామోదర రాజనర్సింహ భార్య పద్మిని బీజేపీలో ఉదయం చేరి... సాయంత్రానికి రాజీనామా చేశారు. 

కూకట్‌పల్లి నేతల చేరిక 
గురువారం బండి సంజయ్‌ సమక్షంలో మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు వడ్డేపల్లి శ్రవణ్‌కుమార్, సునీల్‌కుమార్‌రెడ్డి, కూకట్‌పల్లి రెడ్డి సంఘం అధ్యక్షుడు సాధుప్రతాప్‌రెడ్డి బీజేపీలో చేరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top