అయినా లోటే.. | Rain Percentage Down in Nizamabad District | Sakshi
Sakshi News home page

అయినా లోటే..

Aug 18 2020 12:57 PM | Updated on Aug 18 2020 12:57 PM

Rain Percentage Down in Nizamabad District - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోజంతా ముసురు పెడుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయినప్పటికీ జిల్లాలోని సగం మండలాల్లో లోటు వర్షపాతమే రికార్డయింది. ముప్కాల్, బాల్కొండ మండలాల్లో సాధారణం కంటే 33 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం గమనార్హం. ఈ రెండు మండలాల్లో సోమవారం నాటికి కురియాల్సిన వర్షంలో ఇంకా 33 శాతం తక్కువే ఉందని తేలింది. అలాగే మరో 12 మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, కురవాల్సిన వర్షం కంటే 20 శాతం లోపు వర్షం కురిసినా, 20 శాతం అధికంగా వర్షం కురిసినా సాధారణ వర్షపాతం నమోదైన మండలాలుగానే వాతావరణ శాఖ గుర్తిస్తుంది. మోస్రా, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, వేల్పూర్‌ మండలాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో ఇక్కడ సాధారణం కంటే 20 శాతానికి మించి వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఐదు మండలాలను ఎక్సెస్‌ రెయిన్‌ఫాల్‌ మండలాలుగా గుర్తించారు. 

సగటున 617 మి.మీ. వర్షం.. 
వర్షాకాలం ప్రారంభం జూన్‌ 1 నుంచి జిల్లాలోని 29 మండలాల్లో సగటున 1,042 మి.మీటర్ల సాధారణ వర్షపాతంగా వాతావరణ శాఖ భావిస్తోంది. సోమవారం వరకు అన్ని మండలాల్లో సగటున 603 మి.మీ. వర్షపాతం పడాల్సి ఉండగా, 617 మి.మీల వర్షం కురిసింది. అంటే స్వల్పంగా 14 మి.మీలు (సుమారు 2.3 శాతం) ఎక్కువ వర్షపాతం నమోదైంది. 

ముప్కాల్, మెండోరాల్లో భారీ వర్షం.. 
సోమవారం అన్ని మండలాల్లో వర్షపాతం రికార్డు అయింది. అత్యధికంగా ముప్కాల్, మెండోరా మండలాల్లో 84.5 మి.మీ. వర్షం కురిసింది. ఏర్గట్లలో 83.5, వేల్పూర్‌లో 72.8, నందిపేట్, బాల్కొండల్లో 67.8, కమ్మర్‌పల్లిలో 64.7, మోర్తాడ్‌లో 61.5, నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో 59, ఆర్మూర్‌లో 53, మాక్లూర్‌లో 49.4 మిల్లి మీటర్ల వర్షం కురిసింది.

నిండుతున్న చెరువులు  
నిజామాబాద్‌అర్బన్‌: ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలోని చెరువులు నిండుతున్నాయి. వారం రోజులుగా విస్తారంగా వానలు పడుతుండడంతో చెరువులన్ని కొత్త నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,202 చెరువులు ఉండగా, ఇప్పటివరకు 348 చెరువులు నిండి మత్తడి పారుతున్నాయి. మరో 285 చెరువులు వంద శాతం నిండగా, 317 చెరువులు 75 శాతం నిండాయి. 222 చెరువులు సగం మేరకు నిండగా, 30 చెరువుల్లో 25 శాతమే నీరు వచ్చింది.  

మళ్లీ వంద దాటిన కేసులు  
నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో రెండు, మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. సోమవారం ఒక్కరోజే 105 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 2,404కు చేరింది. తాజా కేసుల్లో ఎక్కువగా నిజామాబాద్‌ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నిజామాబాద్‌ అర్బన్‌లో 32 కేసులు, బోధన్‌లోని రాకాసీపేట పీహెచ్‌సీ పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. అలాగే, అంక్సాపూర్, ఆర్మూర్, వేల్పూర్, భీమ్‌గల్, సిరికొండ, ధర్పల్లి తదితర మండలాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఇక, నగరంలోని ఓ ప్రముఖ ఫిజీషియన్‌కు కూడా కరోనా అని నిర్ధారణ అయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement