రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు! | Rain forecast for two days | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు!

Oct 24 2024 4:26 AM | Updated on Oct 24 2024 4:26 AM

Rain forecast for two days

వాతావరణ నిపుణుల సూచన... 

బంగాళాఖాతంలో తుపాను ప్రభావం 

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు– మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా మారింది. ఇది పారదీప్‌ (ఒడిశా)కు ఆగ్నేయ దిశగా సుమారు 560 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

అనంతరం 25న తెల్లవారుజాము కల్లా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో పూరి, సాగర్‌ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. 

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు: ప్రస్తుతం రాష్ట్రానికి ఉత్తర, ఈశాన్య దిశల నుండి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా. 6.02 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 81.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, బుధవారం నాటికి 102.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

సాధారణ వర్షపాతం కంటే 26 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవన సీజన్‌ నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.   

Advertisement
 
Advertisement
Advertisement