
పది బ్రాంచీల్లో కలిపి 93.87 శాతం అర్హత
ఫలితాలు విడుదల చేసిన ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
ఇంజనీరింగ్ సెకండియర్‌లో అడ్మిషన్లకు త్వరలో కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఈసెట్–2025లో 17,766 మంది అర్హత సాధించారు. ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఆదివారం విడుదల చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మేథ్స్ కోర్సు ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈసెట్)ను ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. 19,672 మంది దరఖాస్తు చేసుకోగా, 18,928 మంది పరీక్ష రాశారు. వీరిలో 17,768 (93.87 శాతం) అర్హత సాధించారు.
ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం (లేటరల్ ఎంట్రీ)లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. మొత్తం పది బ్రాంచీలకు జరిగిన సెట్‌లో బాలురు 10,972 మంది, బాలికలు 6,796 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు. నాన్–లోకల్ కోటా ఎత్తివేయడంతో వారికి తెలంగాణలో ఇంజనీరింగ్‌లో ప్రవేశం ఉండదు.
త్వరలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ ఎం, సెట్ కనీ్వనర్ పి చంద్రశేఖర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
