12లోగా ‘రీయింబర్స్‌మెంట్‌’ ఇవ్వాలి | Private colleges ultimatum to Telangana govt for Fee reimbursement | Sakshi
Sakshi News home page

12లోగా ‘రీయింబర్స్‌మెంట్‌’ ఇవ్వాలి

Oct 2 2025 6:05 AM | Updated on Oct 2 2025 6:05 AM

Private colleges ultimatum to Telangana govt for Fee reimbursement

లేకుంటే 13 నుంచి ఆందోళన 

సర్కారుకు ప్రైవేటు కాలేజీల అల్టిమేటం 

ప్రభుత్వంపై తమకు విశ్వాసం పోయిందన్న యాజమాన్యాలు

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం ఈ నెల 12లోగా చెల్లించకపోతే ఆందోళన చేస్తామని ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఫతి) ప్రకటించింది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం మాట తప్పిందని, ఇచ్చిన హామీ మేరకు దీపావళిలోపు బకాయిలు చెల్లిస్తారన్న నమ్మకం లేదని వెల్లడించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ‘ఫతి’ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.రమేష్‌బాబు మీడియాకు వెల్లడించారు. 

బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు తమతో చర్చలు జరిపారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రూ.1,200 కోట్లలో రూ.600 కోట్లు తక్షణం, మిగతా రూ.600 కోట్లు దీపావళిలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్నుంచీ ప్రభుత్వం చుట్టూ తిరిగామని, అయినా బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 200 కోట్లే ఇచ్చారని, మిగతాదానికి సీఎంవో నుంచి క్లియరెన్స్‌ లేదని అధికారులు చెప్పడం శోచనీయమన్నారు. తమ ఉద్యోగులు కనీసం దసరా పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు.  

ఇక ఉపేక్షించం 
విద్యారంగంపై ప్రభుత్వం శీతకన్ను చూపుతోందని, ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని రమేష్‌బాబు అన్నారు. ఇక ఏమాత్రం ఉపేక్షించలేమని, బకాయిలు ఇవ్వకపోతే 13వ తేదీ నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామన్నారు. క్లాసులు నిర్వహించకపోవడం, విద్యార్థులతో చలో హైదరాబాద్, చలో సెక్రటేరియట్, బంద్‌లు, రాస్తారోకోలు చేపడతామన్నారు. 

ఈ నెల 12లోగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని ఎప్పుటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీలోపు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.సునీల్‌ కుమార్, ట్రెజరర్‌ కె.కృష్ణారావు, జనరల్‌ సెక్రటరీ కేఎస్‌ శివకుమార్, సంఘం నేత నాగయ్య తదితరులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement