విదేశీ బొగ్గు దిగుమతిని అరికట్టాలి
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
రుద్రంపూర్: సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కానివ్వబోమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పీవీకే–5 భూగర్భ గనిలో కారి్మకులతో ఆత్మియ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇల్లెందు క్లబ్‌లో కారి్మక సంఘాలు, బీఎంఎస్ నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప సభకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అవుతుందని ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని అన్నారు.
సంస్థ లాభాలు మొదటగా కారి్మకులకు చెందాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆలోచనా «విధానమని పేర్కొన్నారు. దేశంలో 74 శాతం విద్యుత్ సింగరేణి బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోందని, ఇంకా పలు పరిశ్రమలు నడుస్తున్నాయని తెలిపారు. సంస్థను రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలని సూచించారు. దేశానికి 700 కోట్ల రూపాయల బొగ్గు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోందని, దీన్ని అరికట్టాలని అన్నారు. ఇక్కడి నుంచి ఎగుమతి జరగాలన్నదే ప్రధాన మంత్రి ఆలోచనని, బొగ్గు నాణ్యత పెరిగితే, ఇతర దేశాల దిగుమతి తగ్గుతుందని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస, హైపవర్ వేతనాలు అందేలా, సంస్థకు రావాల్సిన బకాయిలు, కొత్త గనులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
ఉనికి చాటుకునేందుకే లెఫ్ట్ విమర్శలు
తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు ఉనికిని చాటుకునేందుకు విమర్శలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో లెఫ్ట్ పార్టీలకు 50 సీట్ల వరకు ఉండేవని, నేడు ఇతర పార్టీలపై ఆధారపడి ఒకటి రెండు సీట్లకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగలేనని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సింగరేణి సొమ్ము రూ.10 కోట్లను ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ కోసం ఖర్చు చేశాడని, కార్మికుల సొమ్మును ఖర్చు చేసే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మంత్రి వెంట సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, డైరెక్టర్ (పా) గౌతం పోట్రు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఉన్నారు.


