ప్రిన్సిపాల్ బోధనపై విమర్శలు
పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యామ్‌సైడ్‌లోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు మంగళవారం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలో గిరిజన గద్దెల మాదిరి ఏర్పాటు చేసి, సీత్లా పండుగ విశిష్టతపై విద్యార్థులతో వేషాలు వేయించి వివరించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్యామ్‌కుమార్ తెల్ల కోడిని తెప్పించి.. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ముందు దాన్ని కోయడం చర్చనీయాంశమైంది. అవగాహన కల్పించేందుకు కోడి రూపంలోని బొమ్మ తీసుకురావాలి తప్ప.. కోడిని కోయడం సరికాదన్న విమర్శలు వినిపించాయి. దీనిపై ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ వివరణ కోరగా.. గిరిజనులు పండుగల్లో మేకలు కోస్తుంటారని.. అంత పెద్ద జంతువును పాఠశాలలో కోయలేక.. కోడిని కోశానని చెప్పారు.


