జనగణనలో భాగంగా వివరాలు సేకరిస్తున్న ఎన్యూమరేటర్లు
మీ ఇంటి ఫ్లోర్ ఏంటి.. బాత్రూంకు పైకప్పు ఉందా?
జనగణనలో భాగంగా జరుగుతున్న ప్రీటెస్ట్ హౌస్ లిస్టింగ్‌లోని ప్రశ్నలివి..
ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్..
పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రక్రియ
రాష్ట్రంలో మూడు భిన్నమైన నివాసిత ప్రాంతాల్లో ప్రీటెస్ట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రేడియో వింటారా.. ? భోజనంలో రైస్ తీసుకుంటారా..? జొన్న, గోధుమ, మక్క, సజ్జ రొట్టెలు తింటా రా? ఇంటి గచ్చు, గోడలు, పైకప్పు వేటితో కట్టారు.. మీ ఇంట్లో బాత్‌రూం ఉందా.. ఆరుబయట బాత్‌రూం ఉంటే దానికి పైకప్పు ఉందా? ఇంట్లో ఎన్ని గదులున్నాయి. పెళ్లి అయిన జంటలు ఎన్ని ఉన్నాయి.. శుద్ధి చేసిన నల్లా నీళ్లు తాగుతారా? మీరే శుద్ధి చేసుకుంటున్నారా? ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారా.. ఇంటికి విద్యుత్ సరఫరా ఉందా.. సోలార్, కిరోసిన్ దీపం వాడుతున్నారా.. ఇవన్నీ ఏం ప్రశ్నలు అనుకుంటున్నారా? 2027లో జరగనున్న జనాభా లెక్కలకు సంబంధించి ముందస్తుగా ఆయా ప్రాంతాల్లోని నివాసాల జాబితా (హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ షెడ్యూల్)ను రూపొందిస్తున్నారు.
ఈ హౌస్ లిస్టింగ్‌కు సంబంధించి రాష్ట్రంలో ముందస్తు ప్రక్రియ (ప్రీటెస్ట్) జరుగుతోంది. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఈ ప్రశ్నలు వేసి వివరాలు సేకరిస్తున్నారు. వంట ఇంట్లో చేసుకుంటారా.. ఆరు బయట చేసుకుంటారా.. ఎల్‌పీజీ వాడుతున్నారా? కట్టెల పొయ్యితోనా?.. టీవీ, ల్యాప్‌టాప్/ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. సైకిల్, బైక్, కార్ ఉన్నాయా? వంటి వివరాలు సైతం సేకరిస్తున్నారు.
పెన్ను, పేపర్ లేకుండానే..
ఈసారి జనగణన పూర్తిగా డిజిటలైజేషన్ విధానంలో జరుగుతోంది. పెన్ను, పేపర్లతో పనిలేకుండా, ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ ప్రక్రియ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డీఎల్‌ఎం (డిజిటల్ లేఅవుట్ మ్యాప్), హెచ్‌ఎల్‌ఓ (హౌస్ లిస్టింగ్ ఆపరేషన్) యాప్‌లలో వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇంటి జాబితా, ఇళ్ల లెక్కల ప్రీటెస్ట్ ప్రక్రియ రాష్ట్రంలో మూడు భిన్న నివాసిత ప్రాంతాల్లో జరుగుతోంది.
మెట్రోపాలిటన్ ప్రాంతం రామచంద్రాపురం డివిజన్, గ్రామీణ ప్రాంతం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని 19 గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతం ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని 27 గిరిజన ప్రాంతాలను ఈ ప్రీటెస్ట్‌కు ఎంపిక చేశారు. భిన్న ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించడం ద్వారా రానున్న రోజుల్లో నిర్వహించనున్న జనగణనకు ఎలాంటి సవాళ్లు, అవరోధాలు ఎదురవుతాయనే దానిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
నెలాఖరులోగా పూర్తి
వచ్చే ఏడాది జరగనున్న జనగణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఈనెలాఖరు వరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. రాష్ట్ర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. – సురేశ్, చార్జ్ ఆఫీసర్, హౌస్ట్ లిస్టింగ్ సెన్సస్, ఆర్సీపురం
ఎలాంటి ఇబ్బందులు లేవు..
జనగణనకు సంబంధించి ముందుగా ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేసి వాటికి నంబర్లు కేటాయిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 180– 200 ఇళ్లు కేటాయించాం. – అనిల్ ఎన్యుమరేటర్, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా
అడిగిన వివరాలన్నీ ఇచ్చాం
జనగణనకు సంబంధించి మా ఇంటికి వచి్చన ఎన్యుమరేటర్ అడిగిన అన్ని వివరాలను ఇచ్చాం. మరోసారి వచ్చి మరిన్ని వివరాలను సేకరిస్తామని చెప్పారు.
–బొల్లారం నర్సింహా రెడ్డి, ఆర్సీపురం
గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం
హౌస్ లిస్టింగ్‌లో భాగంగా ప్రతీ ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్‌తో అనుసంధానిస్తున్నారు. జియో ట్యాగింగ్ చేసిన ఇంటికి పది మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళితే యాప్‌లో వివరాలు నమోదు కావు. దీంతో ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ప్రతీ ఇంటికి తిరిగి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇంటి యజమాని పేరు, కుటుంబసభ్యుల సంఖ్యతో పాటు, ఇంట్లో కిరాయికి ఉంటున్న కుటుంబ యజమాని పేరు, వారి కుటుంబసభ్యుల సంఖ్యను ఈసారి నమోదు చేస్తున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఈ రెండు సామాజికవర్గాలు కానివారందరినీ ఇతరులుగా పేర్కొంటున్నారు. ఎన్యూమరేటర్లతో సంబంధం లేకుండా పౌరులు ఎవరైనా స్వయంగా తమ వివరాలను హెచ్‌ఎల్‌ఓ యాప్‌లో వివరాలను నమోదు చేసుకునే సదుపాయం కూడా ఉంది.


