ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ | Pre-primary in government schools in Telangana | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ

Jun 12 2025 1:10 AM | Updated on Jun 12 2025 1:10 AM

Pre-primary in government schools in Telangana

ఈ ఏడాది నుంచే అందుబాటులోకి.. 

తొలిదశలో 210 పాఠశాలల్లో ఏర్పాటు 

ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తొలిదశ కింద 210 స్కూళ్లలో దీనికి సంబంధించిన తరగతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 

హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 

జిల్లా అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఒకటవ తరగతిలో చేరే ముందు, అందుకు సన్నద్ధతగా ఈ పూర్వ ప్రాథమిక విద్య దోహదపడుతుంది. ఆటలు, పాటలు, కథల రూపంలో విద్యాబోధన ఉంటుంది. 

ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ పేరిట ప్రీ ప్రైమరీ విద్య రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాది పాటే ఇందుకు సంబంధించిన తరగతులు ఉంటాయని అధికార వర్గాల సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement