
ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ముఖ్యం
విద్యా సంస్థల్లో పెరిగిన ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకుని ఏఐసీటీఈ ప్రత్యేక ప్రణాళిక
రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఇంజనీరింగ్ విద్యలోకి ప్రవేశించే విద్యార్థులకు మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. మానసికంగా బలోపేతం అయ్యేలా కొన్ని రోజులపాటు కార్యక్రమాలు ఉండాలని పేర్కొంది. ప్రతీ కాలేజీలోనూ కౌన్సెలింగ్ కేంద్రాన్నిఏర్పాటు చేయాలని సూచించింది. అర్హులైన కౌన్సెలర్లతో కచ్చితంగా కౌన్సెలింగ్‌లు అమలయ్యేలా యూనివర్సిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలే కాకుండా, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేసింది.
ఒత్తిడిని గుర్తించాలి
ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడి కనిపిస్తోంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు సాధించినా ఒత్తిడికి గురవుతున్నారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఇది తీవ్రంగా ఉందని ఐఐటీలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2018 నుంచి 2025 వరకు ఐఐటీల్లో 39 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 25 మంది, ఎన్‌ఐటీల్లో 25 మంది, ఇతర సంస్థల్లో ఐదుగురు విద్యార్థులు ఈ ఒత్తిడితోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆత్మహత్యలు మూడేళ్లలో 120 వరకు నమోదయ్యాయి. ఇంటర్‌లో బట్టీ విధానం ద్వారా మంచి ర్యాంకులు పొందుతున్నారు. ఇంజనీరింగ్ తొలి ఏడాది నుంచే సొంతంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు.
కౌన్సెలింగే మార్గం
క్లాసులు మొదలయ్యే ముందు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయాలి. న్యూనతా భావంతో ఉన్న విద్యార్థులను వ్యక్తిగతంగా కౌన్సెలర్లు పిలిచి మాట్లాడాలి. వాళ్ల కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఏఐసీటీఈ సూచించింది. విద్యార్థి ఎక్కడ, ఏ విషయంలో భయపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? అనే విషయాలను పరిశీలించాలి. వారికి అర్థమయ్యే విధానంలో బోధన చేయడం ముఖ్యం. ఇంటర్మిడియెట్‌తో పోలిస్తే ఇంజనీరింగ్‌లో సిలబస్ భిన్నంగా ఉంటుంది. విశ్లేషణాత్మకంగా ఉండటం, దాన్ని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకోవడం తప్పనిసరి. ఈ దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఉన్నత విద్యా మండళ్లు, వర్సిటీలు కౌన్సెలింగ్ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించి, పురోగతిని విశ్లేషించడం ద్వారా విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెంచాలని సూచించింది.