సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై టీడీపీ మిత్రపక్షాల నేతలు చేస్తున్న వరుస ప్రకటనలపై అభ్యంతరం చేసిన పొన్నం.. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్న ఆ వ్యాఖ్యల్ని సహించబోమన్నారు.
‘‘ఆంధ్రా- తెలంగాణ విభజనను భారత్ - పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్‌కు లేఖ రాయండి’’ పొన్నం చంద్రబాబును డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్ర విభజనసై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు గొప్పవి. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కానీ, బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలు వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. అలాగే.. ప్రధాని మోదీ గతంలో చేసిన ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అనే వ్యాఖ్యలు అనుచితం.
.. తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. అలాంటి మాటలు మానుకోవాలి. మీ మిత్రపక్షాల పార్టీల నేతల్ని నియంత్రించండి. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలకు ముగింపు పలకాలి. తెలంగాణ వారంతా ఐక్యంగా ముందుకు సాగాలి’’ అని పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు.


