
విద్యార్థిని ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): పాలిసెట్‌లో ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన గూడ స్నేహిత (16) పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. శనివారం విడుదలైన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలిసెట్) ఫలితాల్లో ర్యాంక్ రాలేదని మనోవేదనకు గురైంది.
శనివారం ఉదయం స్నేహిత తల్లిదండ్రులు.. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు. తమ్ముడు, తాతతో కలిసి ఇంట్లోనే ఉన్న స్నేహిత.. సాయంత్రం గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన తాత, తమ్ముడు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.