
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఆదివారం మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. అందరూ మైనర్లే.. ఇన్‌స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో డ్రగ్స్ ఉన్నట్టు సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నగరానికి చెందిన ఒక డీజే ఇన్‌స్టా యాప్‌లో మొయినాబాద్‌లోని చెర్రీ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని.. ఇక్కడకు వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ ఊరించాడు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనేందుకు పాస్‌లు తీసుకోవాలని షరతు విధించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800 ధర నిర్ణయించాడు.
ఇన్‌స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది శనివారం మొయినాబాద్‌లోని ఓక్స్ ఫామ్‌హౌస్‌కు చేరారు. మత్తులో జోగుతున్న సమయంలో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించిన డ్రగ్ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. ఆరుగురు నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మొయినాబాద్ ఠాణాలో అప్పగించారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.