Hyderabad: వలెంటైన్స్‌ డే అలర్ట్‌.. అడ్డుకుంటామంటున్న సంస్థలు.. ప్రేమికులు జాగ్రత్త!

Police Alert On Bajrang Dal Others Opposes Valentines Day Issues Threat - Sakshi

వలెంటైన్స్‌ డే బహిష్కరణ పిలుపులు... ప్రేమికులకు కౌన్సెలింగ్‌ ఇస్తామంటున్న కొన్ని సంస్థలు... ఈ పరిణామాల నేపథ్యంలో ఘర్షణలకు తావు లేకుండా హైదరాబాద్‌ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌లు, యూనివర్సిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో అయిదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్‌ యాజమాన్యాలు దినసరి వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నగరంలో అయిదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్స్, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా  నిర్వాహకులు నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

బౌన్సర్లకు గిరాకీ..
బౌన్సర్‌... ఈ పేరు పబ్స్, బార్స్‌లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలతో వీరు దర్శనమిస్తుంటారు.

అయితే.. వలంటైన్‌ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్‌ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్‌ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు.

శాశ్వత ప్రాతిపదికన బౌన్లర్లు కలిగిన సంస్థలు సైతం మంగళవారం ఒక్క రోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్‌ సైతం ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 60 శాతం బౌన్సర్‌కు, 40 శాతం ఆయా సంస్థలు/జిమ్‌లకు చెందుతాయి.    
చదవండి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top