
ఎంఎంసీసీసీలో నిబంధనలకు విరుద్ధంగా పేకాట
స్టేక్ రూ. 20 వేలకు మించరాదని చెబుతున్న నిబంధనలు
కానీ లక్షల్లో స్టేక్‌లు.. కిట్టీ పేరిట కమీషన్ వసూలు చేస్తున్న ముఠా!
కాయిన్స్ మాటున పెద్దమొత్తంలో చేతులు మారుతున్న డబ్బు
కమిటీ కళ్లు గప్పి నెలకు దాదాపు కోటిన్నర వరకు అక్రమార్జన!
కొత్తగా చేరిన సభ్యులదే ఈ నిర్వాకం అంటున్న పాత సభ్యులు
ముగ్గురి ముఠాకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అండ ఉందనే ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎక్కువగా ధనికులు, ప్రముఖులు నివసించే ప్రాంతం. ఇప్పుడది పేకాటరాయుళ్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వారు నిబంధనలకు విరుద్ధంగా లక్షలు కుమ్మరించి జూదం ఆడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అది ఎమ్మెల్యేలు, ఎంపీల కాలనీ కల్చరల్ సెంటర్ (ఎంఎంసీసీసీ). అందులో 350 మంది వరకు సభ్యులుంటే.. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని 150 మందికి కొత్తగా సభ్యత్వాలు ఇచ్చారు. ఇలా కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారితో సాంస్కృతిక కేంద్రం కాస్తా జూదశాల అనే అపకీర్తి మూట కట్టుకుంటోందని, ‘కిట్టీ’దందా యథేచ్ఛగా సాగుతోందని అసలైన పాత సభ్యులు వాపోతున్నారు.
కమిటీకి తెలియకుండానే..: కాలనీలో నివసించే వారు వారాంతంలో కుటుంబంతో సేద తీరడానికి, చిన్న చిన్న ఆటలు ఆడుకోవడానికి, వేడుకలు నిర్వహించుకోవడానికి అనువుగా ఈ కేంద్రం ఉండేది. దీనిని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో బయటి వారికి సభ్యత్వం ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు సభ్యత్వ రుసుము కింద సేకరించారు. అలా వచ్చిన నిధులతో పాటు కాలనీలో స్థలాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారు కూడా కొంత మొత్తం వేసుకుని సెంటర్‌ను అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడది దుర్వినియోగం అవుతోందని, బడా బాబులంతా కల్చరల్ సెంటర్ వేదికగా పేకాట ఆడుతున్నారని, దీంతో కేంద్రం అభివృద్ధి లక్ష్యం దెబ్బతిని, పక్కా జూదశాలగా మారిపోయిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
చూడ్డానికి అంతా నిబంధనలు పాటిస్తున్నట్లుగానే ఉంటుందని, కానీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా, కల్చరల్ సెంటర్ కార్యనిర్వాహక వర్గాన్ని ఏమార్చి లక్షల రూపాయలతో పేకాట ఆడుతున్నారని నిజమైన సభ్యులు కొందరు వాపోతున్నారు. కొత్తగా చేరిన సభ్యులతో పాటు, వారి గెస్టులు కూడా యధేచ్చగా పేకాట ఆడడానికి వస్తున్నారని చెబుతున్నారు. డబ్బులు కన్పించకుండా కాయిన్స్ రూపంలో ఈ జూదం ఆడుతున్నారని తెలుస్తోంది.
పేకాట ఆడడానికి వెళ్లేవారు.. నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న వారికి ఫీజు చెల్లించి కాయిన్స్ తీసుకుని వాటి ద్వారా పేకాట ఆడుతున్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అండ చూసుకుని అతని సోదరుడు భరత్‌తో పాటు సునీల్‌రెడ్డి, జగదీష్ అనేవారు దీనిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కార్యకలాపాలన్నీ సెంటర్ కమిటీ దృష్టికి రాకుండా జాగ్రత్తగా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. పేకాట ఆడనిచ్చినందుకు కిట్టీ (కమీషన్) తీసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడ్డగోలుగా అక్రమార్జన
ఒక్కొక్కరు లక్ష, రెండు లక్షల రూపాయల స్టేక్‌తో ఆటలు ఆడుతున్నట్లు సమాచారం. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేక్ రూ.20 వేలకు మించరాదని నిబంధనలు చెబుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరు లక్ష రూపాయల స్టేక్ చొప్పున 10 ఆటలు ఆడితే.. ఒక ఆటకు ఏడు పాయింట్లు లెక్కిస్తారు. ఒక్కో పాయింట్‌కు రూ.400 కిట్ చొప్పున 70 పాయింట్లకు రూ.28 వేల కిట్ తీస్తున్నారు. ఇలా ఐదు టేబుల్స్ ఉంటాయనుకుంటే.. 28,000 ్ఠ5 లెక్కన రూ.1.40 లక్షలు కమీషన్ కింద వసూలు చేస్తున్నారన్నమాట.
ఇక రూ.2 లక్షల స్టేక్‌తో ఆడేవారు కూడా ఉన్నారు. రూ.2 లక్షల స్టేక్‌తో ఆడే ఆటలు కూడా లెక్కగట్టి పాయింట్లు తీస్తారు. ఈ క్రమంలో ఒక టేబుల్‌పై ఆరు ఆటలు పూర్తయితే ఏకంగా రూ.1.92 లక్షలు వసూలు అవుతుందని, అలాంటివి మూడు టేబుల్స్ ఆడితే ఒక రోజుకు రూ.5.75 లక్షలు కిట్టీ కింద వసూలు చేస్తున్నారని సమాచారం. ఇలా నెలకు దాదాపు కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని, ఇదంతా మేనేజింగ్ కమిటీకి తెలియకుండానే జరుగుతోందని అంటున్నారు. టేబుల్ దగ్గర డబ్బు పెట్టకపోయినా..అక్కడ ఉండే రెండు గదుల్లో డబ్బు దాస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై ఇటీవలే పోలీసులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం కాగా.. వారు తూతూ మంత్రంగా విచారణకు వచ్చి వెళ్లినట్లు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జరగడానికి వీల్లేదు
ఈ మధ్యనే ఎంఎంసీసీసీ బాగా పాపులర్ అవుతోంది. చాలామంది కల్చరల్ సెంటర్‌కు వస్తున్నారు. మేము కేవలం కాయిన్స్ మాత్రమే ఇస్తాం. అక్కడ ఎలాంటి డబ్బు చేతులు మారడం ఉండదు. అయితే ఆ కాయిన్స్‌కు ఎంత మొత్తం పెట్టి ఆడుతున్నారన్నది కనుక్కోవడం కష్టసాధ్యం. గతంలో ఈ విధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు.
– రాగిడి లక్ష్మారెడ్డి, ఎంఎంసీసీసీ ప్రధాన కార్యదర్శి