మీ ఫుడ్‌ ట్రైన్‌ కాసేపట్లో వస్తుంది

Platform 65 The Train Restaurant In Hyderabad - Sakshi

కొంపల్లిలో ఆకట్టుకుంటున్న ప్లాట్‌ఫాం–65 రెస్టారెంట్‌ 

రైల్వేస్టేషన్‌ మోడల్‌లో ఏర్పాటు 

టేబుళ్లను రైల్వేట్రాక్‌తో అనుసంధానం 

ఆహారాన్ని నేరుగా టేబుల్‌ వద్దకే తెచ్చే ట్రైన్‌  

నగరవాసుల సరికొత్త అనుభూతి  

సనత్‌నగర్‌: దేశ విదేశాల్లోని రైల్వేస్టేషన్ల అనుభూతి కలిగించేలా వినూత్నంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైన్‌ రెస్టారెంట్‌ భోజన ప్రియులను కట్టిపడేస్తోంది. పక్క నుంచే రయ్‌మంటూ సాగిపోయే రైళ్లు..కూర్చున్నకాడికి నోరూరించే వంటకాలను రైళ్లు మోసుకొచ్చేస్తున్నాయి. ప్రయాణికులను, సరుకులను రవాణా చేసే రైళ్లను చూసిన సిటీజనులు..ఇప్పుడు బిర్యానీలు, తమకిష్టమైన వంటకాలను తమ చెంతకు తీసుకురావడం చూసి మురిసిపోతున్నారు.

కేపీహెచ్‌బీకాలనీ ఎదురుగా పీఎన్‌ఆర్‌ కాంప్లెక్స్‌తో పాటు కొంపల్లిలో ప్లాట్‌ఫాం–65 పేరిట ఏర్పాటుచేసిన ట్రైన్‌ రెస్టారెంట్‌ను నగరవాసుల మదిని దోచేస్తోంది. ఒక్కో రెస్టారెంట్‌లో ఆరు రైళ్లతో దేశంలోనే అతిపెద్ద ట్రైన్‌ రెస్టారెంట్‌గా రికార్డు సృష్టించింది కూడా. 

కిచెన్‌ నుంచి నేరుగా టేబుల్‌ మీదకు... 
ప్లాట్‌ఫాం–65 రెస్టారెంట్‌లో ఆర్టర్‌ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే కిచెన్‌ నుంచి నేరుగా వినియోగదారుల టేబుల్‌ మీదకు వారికిష్టమైన వంటకాలతో రైలు వస్తుంది. ముందుగా బేరర్‌ వచ్చి తీసుకున్న ఆర్డర్‌ను ట్యాబ్‌ ఆధారంగా టేబుల్‌ నెంబర్‌తో సహా వంటకాల లిస్టును ఆన్‌లైన్‌లో కిచెన్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా వంటకాలు రైలులో టేబుల్‌ మీదకు వచ్చేస్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న బేరర్‌ వాటిని తీసుకుని భోజన ప్రియులకు వడ్డించడమే.

తాము కోరిన ఆహారంతో తమ కళ్ల ముందుకు వచ్చే రైళ్లు, అలాగే తింటున్నంతసేపు పక్క నుంచి ఫుడ్‌ను తీసుకువెళ్ళే రైళ్ళను చూస్తూ భోజన ప్రియులు సరికొత్త లోకంలో విహరిస్తున్నారు. ఒక్కో ట్రై న్‌కు 5–8 కిలోల బరువు కలిగిన ఆహార పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. అత్యధికంగా 250 మీటర్ల దూరం ప్రయాణిస్తూ వంటకాలను తీసుకెళ్తుంది.  

కువైట్‌ రాజు సైతం ఫిదా.. 
కేవలం రెండు నెలల్లోనే ఈ రెస్టారెంట్‌ ద్వారా రైలు ప్రపంచాన్నే సష్టించారు. ముంబయ్‌కి చెందిన ఓ సాంకేతిక నిపుణుడు సహాయంతో రైల్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే చెన్నైకి చెందిన అలగేష్‌ (మూడుసార్లు గిన్నిస్‌ రికార్డ్‌ ఆఫ్‌ గ్రహీత)చే రైల్వేస్టేషన్ల నమూనాలను తీర్చిదిద్దారు. నగరానికి చెందిన సర్వేష్, వినోద్‌లు దీనిని నెలకొల్పారు. ఇక్కడి ట్రై న్‌ రెస్టారెంట్‌ థీమ్‌ను తిలకించిన కువైట్‌ రాజు అదే సాంకేతిక నిపుణుడిచే ఏకంగా ఓ రోజు పెళ్ళి నిమిత్తం ఇలాంటి రైల్‌ భోజనాలను ఏర్పాటుచేయించుకున్నాడట. ప్రముఖ పారిశ్రామికవేత్త్త హర్షగోయెంకా సైతం ఇక్కడి ట్రైన్‌ రెస్టారెంట్‌కు బందీ అయిపోయి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  

డ్రెస్‌ కోడ్‌లోనూ వెరైటీయే... 
ఇక్కడ పనిచేసే వారి డ్రెస్‌ కోడ్‌ను చూస్తే వాటికీ రైల్‌ పరిమళాలనే అద్దారు. సర్వర్స్‌కు రైల్వే కూలీ ధరించే డ్రెస్, ఆర్డర్‌ తీసుకునే వారికి టీటీ యూనిఫాంనే ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఇక రెస్టారెంట్‌ పేరు విషయానికొస్తే జాతీయ రహదారి 65, చికెన్‌ 65కు అనుబంధంగా ఉండేలా ఫ్లాట్‌ఫామ్‌ 65గా పెట్టారు. 

అంతా రైల్‌ వాతావరణమే.. 
రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన దగ్గర నుంచి అణువణువూ రైల్‌తో అనుబంధాన్ని పెంచేలా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం వద్ద రైలింజన్, రైలు చిహ్నలను ఏర్పాటుచేశారు. రెస్టారెంట్‌ నలువైపులా గోడలపై కాచిగూడ, చెన్నై సెంట్రల్, ముంబయ్‌ సిటీ, పిన్‌ల్యాండ్‌ రైల్వేస్టేషన్లను మరిపించేలా అచ్చుగుద్దినట్లుగా ఆయా స్టేషన్ల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ప్రతి టేబుల్‌ను అనుసంధానం చేస్తూ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటుచేశారు.

ఆయా టేబుల్స్‌ను 32 సబ్‌స్టేషన్లుగా విభజించారు. వీటికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న రైల్వేస్టేషన్ల పేర్లతో బోర్డులు ఏర్పాటుచేశారు. వీటి ఆధారంగా ఫలానా స్టేషన్‌ వద్ద ఉన్నానంటూ ల్యాండ్‌మార్క్‌ చెప్పడం ద్వారా తమవారు ఆ స్టేషన్‌ వద్ద ఉన్న టేబుల్‌ వద్దకు నేరుగా రావచ్చన్నమాట. అలాగే కూర్చొనే సీట్లు కూడా అచ్చం ఏసీ టైర్‌ రైలులో ఉండే సీట్లను పోలినవిధంగా ఏర్పాటుచేశారు. రెస్టారెంట్‌ అంతా పరికించి చూసినవారు రైలు ప్రపంచాన్నే తిలకించేశామన్న భావనకు లోనవుతున్నారు. 

వినూత్న రెస్టారెంటే కాదు.. వినూత్న వంటకాలు సైతం... 
రెస్టారెంట్‌ వినూత్నంగా ఉండడమే కాదు..వంటకాలు సైతం వినూత్నంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. సౌత్, నార్త్‌ వంటకాలు ఇక్కడ అందిస్తున్నారు. అల్లంకోడి వేపుడు, అల్లంకోడి బిర్యానీ, వెల్లుల్లి కోడి, ఉలవచారు కోడికబాబ్, పచ్చిమిర్చి కోడి కబాబ్‌..ఇలా కొత్తదనపు వంటకాలను ఇక్కడ వడ్డిస్తుండడం గమనార్హం. నెలకోమారు ఫుట్‌ ఫెస్టివల్‌ పేరిట 200 రకాల వంటకాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. 

పిల్లల మెదడుకు మేత.. 
ఇక్కడి వంటకాలతో కడుపును నింపుకోవడమే కాదు..భోజన ప్రియుల మెదడుకు సైతం మేతను వేసేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అది కూడా రైల్వే రిలేటెడ్‌గా డిజైన్‌ చేశారు. సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు కూర్చొన్న సీటు దగ్గర ప్లేటు కింద ఆ రెస్టారెంట్‌ లోగోతో పేపర్‌ మ్యాట్‌ ఉండడం సహజం. కానీ ఇక్కడ అదే పేపర్‌ మ్యాట్‌లో పిల్లల మెదడుకు పదునుపెట్టే రీతిలో పలు రకాల హింట్‌ను ఇచ్చి రైల్వేస్టేషన్ల పేర్లను కనుక్కోవడం, అలాగే దారి కనుక్కోవడం వంటి వాటిని ప్రింట్‌ చేసి అందుబాటులో ఉంచడం గమనార్హం. 

త్వరలో దిల్‌సుఖ్‌నగర్, కొండాపూర్‌లలో సైతం..
ప్రస్తుతం కేపీహెచ్‌బీ ఎదురుగా గల పీఎన్‌ఆర్‌ కాంప్లెక్స్‌తో పాటు కొంపల్లిలో ట్రైన్‌ రెస్టారెంట్‌ సేవలు కొనసాగుతున్నాయి. త్వరలో దిల్‌సుఖ్‌నగర్, కొండాపూర్‌లలో సైతం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సిటీవాసులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎక్కడ కొత్తదనం కనిపిస్తుందా? లేక వినోదం, ఉల్లాసంగా ఉండే వాతావరణం ఎక్కడ ఉంటుందా? అని అన్వేషణ చేస్తున్నారు.

ఈ క్రమంలో వారి అభిరుచులకు తగ్గట్టుగా ప్లాట్‌ఫాం 65 ట్రైన్‌ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాం. ప్రతిదీ రైలుతో అనుబంధంగా ఉండేలా డిజైన్‌ చేశాం. దేశంలోనే అతిపెద్ద ట్రైన్‌ రెస్టారెంట్‌గా ఇది నిలుస్తుంది. కస్టమర్లు కూడా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌కు లోనవుతున్నారు. వంటకాల విషయంలో కూడా కొత్తవాటిని పరిచయం చేశాం. 
– సర్వేష్, రెస్టారెంట్‌ నిర్వాహకుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top