Photo Feature: కరోనా వ్యాక్సిన్‌ చెక్‌పోస్ట్‌ చూశారా!

Photo Feature in Telugu: Vaccine Check Post Rajapuram, Cotton Farmer Adilabad - Sakshi

ఎన్నికలు జరిగేటప్పుడు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామ శివార్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం మనకు తెలిసిందే. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి రాజాపురం గ్రామంలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలనే లక్ష్యంతో ఎర్రగుంట పీహెచ్‌సీ సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోకి ప్రవేశించే చోట తాళ్లు కట్టి.. వచ్చివెళ్లే ప్రతీ ఒక్కరినీ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిని మాత్రమే ఆ దారి ద్వారా అనుమతించి.. లేని వారికి అక్కడికక్కడే వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా ఇరవై మందికి పైగా టీకా పంపిణీ చేశారు.     
– అన్నపురెడ్డిపల్లి


పురి విప్పిన నెమలి కాదు గుస్సాడీ కిరీటం

దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేకంగా నిర్వహించుకునే దండారి ఉత్సవాలకు గిరిజనులు సన్నద్ధమవుతున్నారు. తరతరాలుగా వస్తున్న తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు దండారీలో కీలకమైన గుస్సాడీ కిరీటాలను తయారు చేయిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం పిట్టగూడలో నెమలి పింఛాలతో గుస్సాడీ కిరీటాలను తయారు చేశారు. వాటిని ఆదివాసులు ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం నర్సాపూర్‌కు తీసుకొచ్చారు.   
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 


రామా... కనవేమిరా...

అయితే మార్కెట్‌.. లేదంటే ప్రకృతి.. రైతునెప్పుడూ కన్నీరు పెట్టిస్తూనే ఉంది. ఈసారి పత్తికి ధర బాగుంది అని సంతోషించేలోపే ప్రకృతి కన్నెర్రజేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో చెట్టుమీదే పత్తి తడిచి పచ్చిముద్దయ్యింది. తడిసిన పత్తిని ఏరి కల్లాల్లోనో, ఇళ్ల ముందో ఆరబెడుతున్నారు రైతులు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో మంగళవారం ఓ రైతు పత్తి పంటను రామాలయం ముందు ఇలా 
ఆరబెడుతూ కన్పించాడు.      
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top