
పీజీ విద్యార్థిని ఆత్మహత్య
కుటుంబ, ఆర్థిక పరిస్థితుతో మనస్తాపం
ఫర్టిలైజర్ సిటీ(రామగుండం): ఉన్నత చదువులు చదువుదామని ఆశపడిన యువతి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది ఉరేసుకుని తనువు చాలించింది. వివరాలిలా ఉన్నాయి. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్‌కు చెందిన ఆషాడపు కొమురయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తె ఆషాడపు రమ్య(22) పీజీ వరకు విద్యనభ్యసించింది.
ఇంకా ఉన్నత చదువులు చదువుకుందామని ఆశపడింది. తాను చదువుకుంటానని ఇంట్లో తెలిపింది. అయితే, ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నానని మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమ్య మృతితో ప్రగతినగర్ కాలనిలో విషాదం అలముకుంది.