అసహనం..ఆగ్రహం! | - | Sakshi
Sakshi News home page

అసహనం..ఆగ్రహం!

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

అసహనం..ఆగ్రహం!

అసహనం..ఆగ్రహం!

● కరీంనగర్‌ కాంగ్రెస్‌ నాయకులపై రాహుల్‌గాంధీ ఫైర్‌ ● కార్పొరేషన్‌ ఓటమిపై ఇదేం పద్ధతి అంటూ అసహనం ● ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ.. ఇప్పుడు బల్దియానా? అని నిలదీత ● ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసంటూ ఆగ్రహం ● పార్టీలో చేరకుండా ఆశావహులను బెదిరించిన ఆడియోలు వైరల్‌ ● టికెట్ల పంపిణీలో జోక్యంతో డజన్‌ సీట్లు పోయాయని ఆవేదన దమ్కీల ఆడియోలు వైరల్‌ విఫలయత్నాలపైనా రుసరుసలే

ఇటీవలి కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ వారి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలను గెలిపించుకున్నారు. ప్రతిష్టాత్మక కరీంనగర్‌లో పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం లేకుండా పోయింది. పేరుకు టికెట్ల కేటాయింపు అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌ రావుకు ఇచ్చినా.. దాదాపు డజను మంది నేతలు ఎవరికి వారు పైరవీలు, ఒత్తిళ్లు చేసి తమవారికి టికెట్లు ఇప్పించుకున్నారు. పంతాలకు పోయి సర్వేలు, సామాజికవర్గాల సమీకరణాలను పక్కనబెట్టారు. ఇలా టికెట్లు పొందిన వారిలో దాదాపు 12మంది వరకు ఓడిపోయారని పార్టీనేతలు మొత్తుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి పలువురు ఆశావహులను పార్టీ ఆహ్వానించింది. ఇక్కడే సీనియర్‌ నేతలు, వారి కుటుంబ సభ్యులు ఎంటరయ్యారు. ఆశావహులకు ఫోన్లు చేసి దమ్కీలు ఇచ్చారు. మహిళలన్న కనికరం లేకుండా దాడులు చేస్తామని బెదిరించారు. దీంతో అలాంటి వారంతా ఇతర పార్టీల్లో చేరి విజయం సాధించారు. వారిని బెదిరించిన ఆడియోలిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

‘కరీంనగర్‌లో అసలేం జరుగుతోంది? అసెంబ్లీ గెలవలేదు, పార్లమెంటు సీటు గెలవలేదు, ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాం. అర్బన్‌ బ్యాంకు పోగొట్టుకున్నాం.. కనీసం కార్పొరేషన్‌ అయినా దక్కించుకుంటారు అంటే అక్కడా అభాసుపాలయ్యారు. ఇదేం పద్ధతి.. పార్టీ ప్రతిష్టను రోజురోజుకు దిగజార్చుతున్నారు. ఈ పద్ధతేం బాగాలేదు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మీపై చర్యలు తీసుకుంటా..? అవసరమైతే వేటు వేస్తా’?.. ఇవీ.. సాక్షాత్తూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ కరీంనగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి ఇటీవల ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు. పార్టీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే కూడా కాస్త అటూ ఇటుగా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌లో లుకలుకలు, క్షేత్రస్థాయిలో సమన్వయలోపం, అంతర్గత కలహాలు వెరసి ఇక్కడ పార్టీకి మేయర్‌ పీఠం దక్కకుండా చేసిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై నివేదిక తెప్పించుకున్న పార్టీ ఢిల్లీ పెద్దలు జిల్లానేతలకు అక్షింతలు వేసినట్లు సమాచారం.

ఇటీవలి కార్పొరేషన్‌ ఎన్నికల్లో రాజకీయంగా కాంగ్రెస్‌– బీజే పీ మధ్యే పోటీ జరిగింది. నువ్వా– నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నీతానై వ్యవహరించి 30మందిని గెలిపించుకోవడంలో సఫలీకృతుడయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక నుంచి టికెట్ల ఖరారు వరకు పలువురు జోక్యం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం వల్ల పార్టీ 14 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి ముగ్గురు స్వతంత్రులు, ఒక ఎంపీ సీటు బలం ఉండగా.. కాంగ్రెస్‌ ఇతర పార్టీ నేతలను కలుపుకుని మేజిక్‌ ఫిగర్‌ సాధించినా.. చివరి వరకు ఆ ఐక్యతను నిలబెట్టుకోలేక కాంగ్రెస్‌ చతికిలబడి పోయింది. మిగిలిన మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో అనేక మున్సిపాలిటీలు దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌లో బీజేపీని నిలువరించడంలో పూర్తిగా విఫలమైందని కరీంనగర్‌ నేతలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ పార్టీ నాయకుడు ‘సాక్షి’కి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement