33 రోజులు.. రూ.31 కోట్లు
2025– 26 ఆర్థిక సంవత్సరం
కరీంనగర్ కార్పొరేషన్: ఆర్థిక సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనుండగా, నగరపాలకసంస్థ ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచింది. బల్దియా ఎన్నికలతో వసూళ్లకు ఆటంకం ఏర్పడగా, ఇప్పటివరకు డిమాండ్‌లో సగం మాత్రమే వసూలు చేయగలిగారు. మిగతా సగం పూర్తి చేసేందుకు డిఫాల్టర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. బృందాలవారిగా బాధ్యతలు అప్పగించారు.
50 శాతం వసూలు
నగరపాలకసంస్థకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.61.81 కోట్లు డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.30.86 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.30 కోట్ల 95 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. నగరపాలకసంస్థ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లకు ఆటంకం ఏర్పడింది. దాదాపు నెలరోజులకు పైగా ఆస్తిపన్ను వసూలు నిలిచిపోయింది. ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకవర్గం కొలువుతీరిన క్రమంలో మళ్లీ వసూళ్లను వేగవంతం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 33 రోజులు మాత్రమే గడువు ఉండడంతో, ఆ లోగా మిగతా 50 శాతం వసూలు చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మొండిబకాయిదారులపై ఫోకస్
ఆస్తిపన్ను వందశాతం లక్ష్యానికి అడ్డుగా ఉన్న మొండి బకాయిదారులపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. మిగతా వారికి నోటీసులు ఇస్తున్నారు. అయినప్పటికీ పన్ను చెల్లించకపోతే నల్లా కట్ చేయడం, సామగ్రి స్వాధీనం చేసుకోవడం లాంటి పనులకు పూనుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్తి పన్ను వంద శాతం లక్ష్యాన్ని చేరుకొనే దిశగా నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగం అధికారులు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తున్నారు. ఆస్తిపన్ను వసూళ్లకు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు డివిజన్‌లకు ఒక వారంట్ ఆఫీసర్‌ను వసూళ్లకు బాధ్యుడిగా నియమిస్తున్నారు. వారంట్ అధికారి బృందంలో సంబంధిత వార్డు అధికారులు, లైన్‌మెన్, ఫిట్టర్, ఆర్‌వో, ఆర్‌ఐ ఉంటారు. వీరంతా తమ పరిధిలో ఆస్తి పన్ను వసూలు చేస్తారు.
ఆస్తిపన్ను డిమాండ్: రూ.61.81 కోట్లు
ఇప్పటివరకు వసూలు రూ.30.86 కోట్లు
కావాల్సింది: రూ.30.95 కోట్లు


