ఎలుకా.. ఎలుకా ఎక్కడున్నావ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలుకా.. ఎలుకా ఎక్కడున్నావ్‌

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

ఎలుకా.. ఎలుకా ఎక్కడున్నావ్‌

ఎలుకా.. ఎలుకా ఎక్కడున్నావ్‌

● ఎలుకల వేటలో ఏపీ వలస కూలీలు ● తెలంగాణలో 200 మందికి ఉపాధి ● పంట పొలాల్లో నియంత్రణకు మందు ● సీజన్‌ పూర్తయ్యే వరకు ఇక్కడే నివాసం తాతల నుంచి ఇదే వృత్తి

కరీంనగర్‌రూరల్‌: తెలంగాణ రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఎలుకలు ఆంధ్రా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పంట పొలాల్లో ఎలుకలు చేస్తున్న విధ్వంసంతో జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతుండగా, వలస కూలీలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. పొలాల్లో ఎలుకల బెడదను నియంత్రించేందుకు పలువురు రైతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఎలుకలు పట్టేందుకు ఎకరానికి కొంతమొత్తంలో వసూలు చేయడం ద్వారా జీవనోపాధిపొందుతున్నారు.

కత్తిమీద సాములా..

కరీంనగర్‌ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాల్లో ఎలుకలు వరిగింజలను కొరికేయడంతో పంట తాలుగా మారి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు రైతులు ఎలుకలను చంపేందుకు విషపూరితమైన మందును పెట్టడం, బోను అమర్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఎలుకలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ దిశగా ఆలోచించిన కొందరు రైతులు ఆంధ్రప్రదేశ్‌లో ఎలుకల నిర్మూలనకు అవలంబిస్తున్న సాంప్రదాయ విధానాలను తెలుసుకుని సంప్రదించారు. బాపట్ల జిల్లా మేదరిమెట్లకు చెందిన మల్ల కొండయ్య సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన మందును నూకలతో కలిపి పొలాల్లో ఎలుకలు తిరిగే ప్రాంతాల్లో వేస్తూ ఎలుకలను నిర్మూలిస్తున్నాడు. పలువురు కూలీలకు ఉపాధి కల్పిస్తూ కొన్నేళ్లుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నాడు.

స్థానికంగానే కూలీల నివాసం

రైతులు ఎలుకల నిర్మూలనకు కొండయ్యను సంప్రదించిన వెంటనే గ్రామాలకు కూలీలను పంపిస్తాడు. ఎకరానికి రూ.200 చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తాడు. పంట పొట్టదశ నుంచి కోతపూర్తయ్యే వరకు కూలీలు ఆయా గ్రామాల్లోనే నివాసముంటారు. మహిళలు నూకలతో కలిపి ఎలుకల మందును తయారు చేస్తుండగా పురుషులు పొలాల్లో మందు వేసే పనులు చేస్తారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం తదితర జిల్లాలకు సుమారు 200 మంది కూలీలు ప్రస్తుత యాసంగి సీజన్‌కు ఎలుకలను నిర్మూలించేందుకు వచ్చారు. పొలాల్లో ఎలుకల నిర్మూలనకు మూడు దశల్లో నూకల్లో కలిపిన మందును వినియోగిస్తారు. ముందుగా ఎలుకలున్న ప్రాంతాలను గుర్తించి నూకలను వేయడంతో తిని చనిపోతాయి. పంట కోత పూర్తయిన తర్వాత ఎకరానికి రూ.200చొప్పున రైతులు చెల్లిస్తారు.

మా తాత ముత్తాతల నుంచి పంట పొలాల్లో ఎలుకలను నిర్మూలించే పని చేస్తున్నాం. మేదరిమెట్లలోని మెజార్టీ కుటుంబాలన్ని ఇదేవృత్తిలో జీవనం కొనసాగిస్తున్నాయి. వేసవికాలంలో పొలాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో ఆంధ్రా నుంచి ఉపాధికోసం తెలంగాణకు వస్తున్నాం. మాకు నెలకు రూ.6వేల చొప్పున ఇస్తారు. భోజనంతో పాటు వసతి కల్పిస్తారు.

– ఆవుల రమేశ్‌, మేదరిమెట్ల, ఆంధ్రప్రదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement