దర్జాగా జీవితకాల పన్నుకు ఎగనామం
ఆర్టీఏ సిబ్బంది చేతివాటం
సర్కార్ ఖజానాకు భారీగా గండి
దళారులతో అధికారుల కుమ్మక్కు
వాహన తనిఖీ నివేదికలు తారుమారు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక నెంబర్‌లు, ఫ్యాన్సీ నెంబర్‌ల ఫీజులను భారీగా పెంచిన రవాణా అధికారులు చట్టబద్ధంగా రావాల్సిన జీవితకాల పన్ను వసూళ్లలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త వాహనాలపై కొనుగోలు సమయంలోనే వాహనదారులు రవాణాశాఖకు లైఫ్‌ట్యాక్స్ చెల్లించడం ఆనవాయితీ. వాహనాల ఖరీదులో 12 శాతం నుంచి 24 శాతం వరకు ఈ పన్ను ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇలాంటి వాహనాలను పట్టుకున్నప్పటికీ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. ఎంవీఐలు రాసిన వాహన తనిఖీ నివేదికలనే (వెహికల్ చెక్ రిపోర్ట్స్) తారుమారు చేస్తూ రవాణా శాఖ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దళారులు, ఏజెంట్‌లతో కుమ్మక్కవుతున్న కొందరు అధికారులు, ఉద్యోగులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
బండ్లగూడ పరిధిలో యథేచ్ఛగా ఉల్లంఘన..
సాధారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు నగరంలో తిరిగేందుకు 30 రోజుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత తిరిగితే జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ వాహనాన్ని హైదరాబాద్‌కు బదిలీ చేసుకోవాలనుకొంటే ఇన్‌వాయిస్‌పై కొనుగోలు చేసిన కాలపరిమితిని మినహాయించి మిగతా కాలానికి లైఫ్‌ట్యాక్స్ చెల్లించాలి. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీ అయ్యే వాహనాలన్నింటికీ ఇదే పద్ధతి వర్తిస్తుంది. కానీ కొందరు అధికారులు ఇక్కడే తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎంవీఐలు రాసిన వాహన తనిఖీ నివేదిక (వీసీఆర్)లను తారుమారు చేసి ప్రభుత్వాదాయాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయం ఇలాంటి అక్రమాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత అక్టోబర్‌లో పట్టుబడిన ఒక వాహనం నుంచి నిబంధనల మేరకు దాదాపు రూ.2 లక్షల వరకు జీవితకాల పన్ను లభించాల్సి ఉండగా.. అక్కడ విధులు నిర్వహించే ఓ అధికారి ఏజెంట్‌ల సహాయంతో మాయాజాలం చేసి వాహనదారుడి నుంచి కేవలం రూ.1200 వసూలు చేసినట్లు సమాచారం. వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఆర్టీఏ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని సమాచారం.
వాహనం లేకపోయినా ఫిట్‌నెస్...
సామర్థ్యం నిర్ధారణ కోసం బండ్లగూడ ఆర్టీఏకు సగటున 30 నుంచి 40 వాహనాలు మాత్రమే వస్తాయి. కానీ ప్రతిరోజు అంతకు రెట్టింపు సంఖ్యలో వాహనాలకు అక్కడ ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు. మరోవైపు ఆ కార్యాలయం పరిధిలో లేని నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలకు సైతం ఫిట్‌నెస్ సరి్టఫికెట్‌లను అందజేయడం గమనార్హం. కాలం చెల్లిన లారీలు, డీసీఎంలు, డొక్కు వాహనాలకూ కొందరు ఎంవీఐలు యథేచ్ఛగా ఫిట్‌నెస్‌లు అందజేస్తున్నారు. రోడ్లపై, వర్క్‌షాపులలో, ఇతర ఊళ్లల్లో ఉన్న వాహనాలకు కూడా బండ్లగూడలో ఈజీగా ఫిట్‌నెస్ సరి్టఫికెట్‌లు లభిస్తాయని చాంద్రాయణగుట్టకు ఓ ఏజెంట్ తెలిపారు. బండ్లగూడతో పాటు నగరంలోని మరికొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో కూడా ఈ తతంగం నడుస్తోందనే ఆరోపణలున్నాయి.


