పేపర్‌ లీకేజీలు సర్వసాధారణం.. దీనికే మంత్రి కేటీఆర్‌ దోషా? సీఎంకు నోటీసులివ్వాలంటారా?: ఇంద్రకరణ్‌రెడ్డి 

Paper Leakage Is Common Says Minister Indrakaran Reddy - Sakshi

నిర్మల్‌/నిర్మల్‌ టౌన్‌: ‘పేపర్‌ లీకేజీలు సర్వసాధారణంగా జరుగుతుంటాయ్‌.. అప్పుడప్పుడూ ఇంటర్, టెన్త్‌లో ఎన్నో రకాలుగా జరుగుతాయి. దీనికే మంత్రి కేటీఆర్‌ను దోషి అంటున్నారు. సీఎంకే నోటీసులు ఇవ్వాలంటున్నారు. కేటీఆర్‌ పీఏ తిరుపతికి చెందిన గ్రామంలోనే 100 మందికిపైగా నూరు మార్కులపైనే వచ్చాయని రేవంత్‌రెడ్డి అంటే ‘సిట్‌’ ఆయనకు నోటీసులిచ్చింది. ఆధారాలుంటే చూపెట్టాలి. నిజంగా ఉంటే తప్పు జరిగిందని ఒప్పుకోవచ్చు. ఆధారాలు చూపెట్టమనడంలో తప్పేంలేదు’ అని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

ఆయన మాటలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. ఎమ్మెల్సీ కవిత విచారణ, పేపర్‌ లీకేజీ, పార్టీ ఆత్మీయ సమ్మేళనాలపై నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందులో పేపర్‌ లీకేజీ అంశంపై మాట్లాడే సందర్భంలో సర్వసాధారణంగా క్వశ్చన్‌ పేపర్ల లీకేజీలు జరుగుతుంటాయని ఆయన అనడం చర్చనీయాంశమైంది.

కవితను కేంద్రం వేధిస్తోంది..
తెలంగాణ కోసం ఉద్యమించిన కల్వకుంట్ల కవితను ఓ మహిళ అని కూడా చూడకుండా ఈడీ ద్వారా కేంద్రం వేధిస్తోందని ఇంద్రకరణ్‌ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో విచారణ పేరుతో మళ్లీమళ్లీ పిలుస్తోందని విమర్శించారు. దేశంలోకెల్లా ప్రధాని మోదీపై ఎదురుదాడి చేసే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆరేనని చెప్పారు. కేంద్రానికి దమ్ముంటే సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలని, ఇలా మహిళలను అడ్డుపెట్టుకొని ఆటలడటం సరికాదని సూచించారు.

బీజేపీ వాళ్లంతా సత్యపూసలా? 
బీజేపీలో ఎవరూ కూడా తప్పు చేయడం లేదా? వాళ్లంతా సత్యపూసలు, వేరే పారీ్టల వాళ్లే దోషులా? అని ఇంద్రకరణ్‌ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల కోసం చేసిన బిల్లులను నామినేటెడ్‌గా వచి్చన గవర్నర్‌ అట్టిపెట్టుకుంటే బీజేపీ నేతలు ఉత్సవాలు చేసుకుంటున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాజీనామా చేయమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్లకు చెప్పుకోవడం రాదు కానీ.. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ 12 ఏళ్లు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.

నా మాటలను వక్రీకరించారు.. 
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాలుక కరుచుకున్నారు. తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ హయాంలో పేపర్‌ లీకేజీలు సర్వసాధారణమయ్యాయనే సందర్భంలోనే నేను మాట్లాడాను’అని వివరణ ఇచ్చారు. పేపర్‌ లీకేజీ దురదృష్టకరమని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు.
చదవండి: కొలువుల కలవరం

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top