
హైదరాబాద్: తన అపార్ట్‌మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్‌మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు.
దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్‌ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ తనపై కూడా దాడి చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.