దాయాది సైబర్‌ వార్‌కు చెక్‌ | Pakistan Launches Operation Bunyan-ul-Marsoos | Sakshi
Sakshi News home page

దాయాది సైబర్‌ వార్‌కు చెక్‌

May 26 2025 5:07 AM | Updated on May 26 2025 5:07 AM

Pakistan Launches Operation Bunyan-ul-Marsoos

ఆపరేషన్‌ బనియన్‌ మార్సూస్‌ చేపట్టిన పాకిస్తాన్‌ 

భారత వ్యవస్థలు, సంస్థలే లక్ష్యంగా ఐదు దశల్లో సైబర్‌ దాడులు 

మద్దతిచ్చిన చైనా, ఇరాన్, తుర్కియే, ఉత్తర కొరియా

సమర్థంగా తిప్పికొట్టిన మన ఏజెన్సీలు, ఎథికల్‌ హ్యాక్టివిస్టులు

సాక్షి, హైదరాబాద్‌: తూటాలు, క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం... ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌లోని ముష్కరులపై భారత్‌ సాగించిన కైనెటిక్‌ వార్‌ ఫేర్‌ ఇది. కానీ వర్చువల్‌ వరల్డ్‌లో మరో పెద్ద యుద్ధమే జరిగింది. ‘ఆపరేషన్‌ బనియన్‌ ఉమ్‌ మార్సూస్‌’పేరుతో పాకిస్తాన్‌ పన్నిన కుయుక్తుల్ని భారత ఏజెన్సీలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్ర దాడి జరగ్గా మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ మొదలవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 10 నుంచి తాము ఆపరేషన్‌ మార్సూస్‌ను చేపట్టినట్లు పాక్‌ హ్యాకర్లు వర్చువల్‌ వరల్డ్‌లో ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవానికి పహల్గాం దాడి జరిగిన మర్నాడే సైబర్‌ ఎటాక్స్‌ మొదలైనట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదు దశల్లో ఇవి జరిగాయని, భారత ఏజెన్సీలతోపాటు ఎథికల్‌ హ్యాక్టివిస్టులు వాటిని సమర్థంగా తిప్పికొట్టారని తాజాగా వెల్లడించాయి. 

సందేశాలతో మొదలుపెట్టి డాస్, డీడాస్‌... 
పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు సైబర్‌ దాడుల్ని వివిధ పంథాల్లో చేపట్టినట్లు మన ఏజెన్సీలు గుర్తించాయి. గత నెల 23 నుంచి 26 వరకు జరిగిన మొదటి దశలో పాక్‌ హ్యాకర్లు ముఠాలుగా ఏర్పడి సైబర్‌ దాడులు చేశారు. హ్యాక్టివిస్టులుగా పిలిచే ఈ ముష్కరులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్కూళ్లు, కళాశాలలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను టార్గెట్‌ చేశారు. కేవలం తమ స్లోగన్లు, రెచ్చగొట్టే సందేశాలు ప్రదర్శించడానికే వారు ప్రాధాన్యం ఇచ్చారు.

ఏప్రిల్‌ 27 నుంచి మే 2 వరకు జరిగిన రెండో దశ సైబర్‌ ఎటాక్‌తో తీవ్రత పెరిగింది. అందులో ఈ–సేవ, ఈ–గవర్నెన్స్‌తోపాటు ప్రజాసేవలకు సంబంధించిన వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ కలిసిన మాల్‌వేర్‌ను పంపడం ద్వారా వెబ్‌సైట్లు కుప్పకూలేలా చేయాలని ప్రయతి్నంచారు. వాటినే సాంకేతికంగా డాస్‌ (డినైయల్‌ ఆఫ్‌ సర్విసెస్‌), డీడాస్‌ (డ్రిస్టిబ్యూటెడ్‌ డినైయల్‌ ఆఫ్‌ సర్విసెస్‌) ఎటాక్స్‌ అని వ్యవహరిస్తుంటారు.  

మూడో దశలో ర్యాట్‌లను పంపిస్తూ... 
పాక్‌ హ్యాకర్లు మే 3 నుంచి మే 6 మధ్య మూడో దశలో రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌ (ర్యాట్‌) విధానంలో ఫిషింగ్, స్పియర్‌ ఫిషింగ్‌ తరహా సైబర్‌ ఎటాక్స్‌ చేశారు. ఈ–మెయిల్స్, వాట్సాప్‌ సందేశాల్లో మాల్‌వేర్‌ను జోడించి పంపారు. దీన్ని ఎవరైనా క్లిక్‌ చేస్తే వారి ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు హ్యాకర్ల అ««దీనంలోకి వెళ్లిపోతాయి. ఆ డేటా మొత్తాన్ని లాక్‌ చేసి ఎన్‌క్రిప్ట్‌ చేసే అవకాశం వారికి వస్తుంది. దీన్ని డీక్రిప్ట్‌ చేయడానికి క్రిప్టో కరెన్సీ డిమాండ్‌ చేస్తారు. ఆ దశలో ఆయిల్, గ్యాస్‌ ఇండస్ట్రీ, తయారీ రంగంలో ఉన్న సంస్థలు టార్గెట్‌గా మారాయి. మే 7 నుంచి 12 వరకు సాగిన నాలుగో దశ ఎటాక్స్‌లో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) టార్గెట్‌గా మారింది. అడ్వాన్డ్స్‌ ప్రెసిస్టెంట్‌ థ్రెట్‌ 36 (ఏపీటీ 36) పేరుతో నిష్ణాతులైన హ్యాకర్ల సమూహం ఈ దాడుల్ని చేసింది.  

పాక్‌కు మద్దుతుగా ఐదు దేశాల హ్యాకర్లు... 
ఈ నెల 12 నుంచి దాదాపు 10 రోజులపాటు సాగిన ఐదో దశ సైబర్‌ ఎటాక్స్‌లో పాక్‌ హ్యాక్టివిస్టులకు చైనా, తుర్కియే, ఇరాన్, ఉత్తర కొరియా హ్యాకర్లూ తొడయ్యారు. వారంతా కలిసి ఏపీటీ 36తోపాటు ఏపీటీ 10, ఏపీటీ 28, మడ్డీ వాటర్, లజారస్‌ పేర్లతో సమూహాలుగా ఏర్పడ్డారు. ప్రజాసేవల రంగాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. టెలికమ్యూనికేషన్స్, పవర్‌ గ్రిడ్, బ్యాంకింగ్‌ రంగాలను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ ఎటాక్స్‌ చేశారు. ఇందుకోసం ఒపేక్‌ డ్రాకో, మాకింగ్‌ డ్రాకో, సైడ్‌ వైండర్, టీమ్‌ ఇన్సానే పీకే, టీమ్‌ అజ్రేల్‌–ఎంజెల్‌ ఆఫ్‌ డెత్, సైలెంట్‌ సైబర్‌ ఫోర్స్‌ పేర్లతో బృందాలుగా ఏర్పడ్డారు. భారత ఏజెన్సీలు, మన ఎథికల్‌ హ్యాక్టివిస్టులు విదేశీ సైబర్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో దేశీయ సంస్థలకు భారీ నష్టం ఏమీ వాటిల్లలేదు. సైబర్‌ దాడుల ముప్పు ఇంకా కొనసాగొచ్చని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement