వదలని వాన.. వరదలా..

Orange alert for the state and two more days of rain - Sakshi

కరీంనగర్‌ జిల్లా రామడుగులో అత్యధికంగా 16 సెం.మీ. వర్షపాతం

గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 3.45 సెంటీమీటర్ల సగటు వాన 

నాలుగు రోజుల్లోనే 20 శాతం లోటు నుంచి 6 శాతం అధికానికి...

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

 రాష్ట్రానికి ఆరెంజ్‌ అలర్ట్‌.. మరో రెండు రోజులూ వానలు  

రాష్ట్రంలో నాలుగో రోజూ వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 

ఆనందంలో అన్నదాతలు.. సాధారణ ప్రజలకు ఇబ్బందులు 

ఎడతెరిపిలేని వానతో అలుగు పారుతున్న చెరువులు.. రోడ్లపైకి నీళ్లు 

ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలు జల దిగ్బంధం.. స్తంభించిన జన జీవనం 

ఎగువ గోదావరికి ప్రవాహం మొదలు.. దిగువన పోటెత్తుతున్న వరద 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రాన్ని నాలుగో రోజూ వానలు ముంచెత్తాయి. రాజధాని హైదరాబాద్‌ సహా చాలా జిల్లాల్లో పొద్దుమాపు ముసురుపట్టింది. పలుచోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటం, గ్రామాలు జలదిగ్బంధం కావడం, రహదారులపై నీరు చేరడం, ముసురుతో ఇంట్లోంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది.

ఇదే సమయంలో భారీ వర్షాలతో సాగునీటికి కష్టాలు తీరుతాయంటూ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారంతా వ్యవసాయ పనులు ముమ్మరం చేయడంలో నిమగ్నమవుతున్నారు. ఇక మరో రెండు రోజుల పాటు వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. 

ఒక్కరోజే సగటున 3.45 సెం.మీ
గురువారం రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే సగటున 3.45 సెంటీమీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా మెదక్‌ జిల్లాలో సగటున 9.46 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 9.04 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 8.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలే కురిశాయి. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. 

స్తంభించిన జనజీవనం..
నాలుగు రోజులుగా ముసురుపట్టే ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాజేడు మండలం టేకులగుడెం వద్ద జాతీయ రహదారి మునిగిపోవడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముసురు ప్రభావంతో ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తినిలిచిపోయింది. 

హైదరాబాద్‌లో రోజంతా వాన 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం రోజంతా వాన కురిసింది. చాలా కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీనితో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

విద్యుత్‌ తీగలు తెగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. పదుల సంఖ్యలో పాత ఇళ్లు కూలిపోయాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా మల్కాజిగిరిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏడెనిమిది సెంటీమీటర్లకుపైగానే వాన కురిసింది. 

ఉప్పొంగిన వాగులు.. రాకపోకలు బంద్‌ 
♦ సంగారెడ్డి జిల్లాలోని ఫతేపూర్‌– పిట్ల రోడ్డులోని తాత్కాలిక వంతెన తెగిపోయింది. మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది. 
♦ మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు జలమయం అయ్యాయి. రామాయంపేట– సిద్దిపేట రహదారిపై కోనాపూర్‌ వద్ద వరద చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఘనపురం వాగు ఉప్పొంగడంతో ఏడుపాయల వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 
♦ సిద్దిపేట జిల్లాలో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో హన్మకొండ– సిద్దిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
♦ కుమురంభీం జిల్లాలో దహెగాంలో పెద్దవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. పాటగూడ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెన కోతకు గురైంది. 
♦ ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులగూడెం సమీపంలో 163 నంబర్‌ జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు బారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. 
♦ వరంగల్‌ నగరంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

లోటు నుంచి అధిక వర్షపాతానికి.. 
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు దాటిపోయినా వానలు సరిగా కురవలేదు. ఇటీవలి వరకు 30శాతానికిపైగా లోటు వర్షపాతం కొనసాగింది. కానీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మారింది. లోటు పూడిపోవడమేగాక 6 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం.

వానాకాలం సీజన్‌లో జూలై 20 నాటికి 26.46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం నాటికి 27.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అధికంగా, 21 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవగా.. మిగతా 5 జిల్లాల్లో మాత్రం కాస్త లోటు ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది.

మరో రెండు రోజులూ వానలు 
వాయవ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనమూ ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది.

ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top