Yashwant Sinha: ఇది రెండు భావజాలాల మధ్య పోరు

Opposition Presidential Candidate Yashwant Sinha Speech At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భారతదేశం పతనం బాటలో సాగుతోంది. ఈ పతనం మన కళ్లముందే జరుగుతోంది. ప్రస్తుతం జరిగే రాష్ట్రపతి ఎన్నిక రెండు భావజాలాల మధ్య జరిగే యుద్ధం. రాష్ట్రపతి ఎన్నికను పక్కన పెడితే దేశాన్ని నాశనం కానిద్దామా?’అని రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్‌ సిన్హా ప్రశ్నించారు. సీఎం, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నేతృత్వంలో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఘర్షణ వాతావరణంపైనే ప్రధానికి విశ్వాసం 
‘ప్రధానిపై వ్యక్తిగత ద్వేషం లేదు. నామినేషన్‌ తర్వాత ఫోన్‌ చేసి, మెసేజ్‌ పంపినా నేటికీ స్పందన లేదు. ఇది దేశ ప్రధానికి గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయం ఎంత మాత్రమూ కాదు. ఈ ఎన్నిక చాలా అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోంది. ఆదివాసీ మహిళ పోటీ చేస్తున్న సందర్భంలో ఏకాభిప్రాయ సాధన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో మాట్లాడాల్సిన ప్రధాని అ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రధానికి ఏకాభిప్రాయ సాధనకంటే ఘర్షణ వాతావరణంపైనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఇతరులను అవమానించడం ఆయనకు అలవాటుగా మారింది.

ఆయన డిక్షనరీలో ఏకాభిప్రాయమనే పదమే లేదు. దేశంలో రెండో పక్షంలో ఉన్నవారికి గౌరవం ఉండదా? అందుకే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరి వ్యక్తుల నడుమ కొట్లాట కాదు.. రెండు భావజాలాల నడుమ జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని మీ సహకారంతో చేస్తున్నా. యుద్ధానికి వెళ్లినపుడు ఎంత పెద్ద కత్తి ఉంది, ఎంత పెద్ద సైన్యం ఉందనేది చూడకుండా మన వద్ద ఉన్న ఆయుధంతో పోరాడుతాం. మన దేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది..’అని సిన్హా చెప్పారు. 

పోరాటం కొనసాగుతుంది.. 
‘ఆల్ట్‌ న్యూస్‌ జుబేర్‌ను వైషమ్యాలు పెంచుతున్నారని జైలులో పెట్టారు. కానీ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై చట్టబద్ధవిచారణేదీ మొదలవలేదు. దీనిపై ప్రధాని మౌనం పాటిస్తున్నారు. మన్‌ కీ బాత్‌ అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ఎనిమిదేళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు. అంటే ఒక్కడు మాట్లాడితే 140 కోట్ల భారతీయులు వినాలా? దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఫలితం ఏదైనా చింత లేదు. ఈ పోరాటం ఎన్నిక తర్వాత కూడా కొనసాగుతుంది..’అని తెలిపారు. 

తెలంగాణలో అద్భుతాలు 
‘సీఎం కేసీఆర్‌తో కలిసి దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం. ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌తో కలిసి మాట్లాడి పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో చర్చిస్తాం. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణను సాధించి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్‌ తక్కువ సమయంలో అద్భుతాలు చేసి చూపించారు. కేవలం ఒక్కడిగానే పోరాడి కేసీఆర్‌ తెలంగాణ సాధించారు. దేశం నాశనం కాకుండా జరుగుతున్న పోరాటం హైదరాబాద్‌ నుంచే ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టాక రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తా. దేశంలో చర్చలు జరగకపోవడం దురదృష్టకరం. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఎన్నడూ విపక్షాలు, రాజకీయ శత్రువుల అణచివేతకు ఈడీ వంటి సంస్థలను ఉపయోగించాలనే కనీస ఆలోచన కూడా రాలేదు. ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాడుతాం..’అని యశ్వంత్‌ సిన్హా స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top