సిటీలో 4.1, స్టేట్‌లో 2.8% | Only 2. 8 Percentage of city population know CPR technique | Sakshi
Sakshi News home page

సిటీలో 4.1, స్టేట్‌లో 2.8%

Jun 25 2026 5:28 AM | Updated on Jun 25 2026 5:28 AM

Only 2. 8 Percentage of city population know CPR technique

మన దగ్గర సీపీఆర్‌ చేయడం వచ్చినవారి శాతం ఇదీ..

నార్వే, డెన్మార్క్‌లో 5వ తరగతి నుంచే సీపీఆర్‌ తప్పనిసరి.. 

అక్కడ సర్వైవల్‌ రేట్‌ 40శాతం

జపాన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే సీపీఆర్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిందే

మన స్కూళ్లలోనూ సీపీఆర్‌ను పాఠ్యాంశంగా చేర్చాలంటున్న వైద్య నిపుణులు

2026 మార్చిలో జూబ్లీహిల్స్‌లో జాగింగ్‌ చేస్తూ ఓ 52 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తీవ్ర గుండెపోటుకు గురి అయ్యాడు. అక్కడే ఉన్న వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఒకరు వెంటనే సీపీఆర్‌ చేయ డంతో రోగిని ఆస్పత్రికి తరలించేలోగా గుండె కొట్టుకోవడం తిరిగి మొదలైంది.

⇒  2025 డిసెంబర్‌లో ఎల్బీ నగర్‌ వద్ద మెట్రో రైల్లో ఓ 28 ఏళ్ల యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ సకాలంలో సీపీఆర్‌ చేయడంతో ఆమె గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏటా సుమారు 80 వేల మంది సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణిస్తుంటే వారిలో 90 శాతం మంది ఆస్పత్రికి చేరేలోపే ప్రాణం వదులుతున్నారు. అంబులెన్సుల సగటు రెస్పాన్స్‌ టైం 12 నిమిషాలుగా ఉంటోంది. ఇలాంటి సందర్భాల్లో జరిగే ప్రతి నిమిషం ఆలస్యం రోగి బ్రతికే అవకాశాలను 10 శాతం చొప్పున తుడిచేస్తోంది. ఎందుకంటే.. గుండె ఆగిన 4 నిమిషాల్లోగా మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పునరుద్ధరణ కాకపోతే అది శాశ్వతంగా దెబ్బతింటుంది. దీన్నే గోల్డెన్‌ 4 మినిట్స్‌ అంటారు.

అంటే కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారికి చికిత్స ప్రారంభమయ్యేలోగా వారి గుండెను తిరిగి కొట్టుకొనేలా చేసి ప్రాణం నిలిపే బ్రహ్మాస్త్రం లాంటి ప్రక్రియే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌). కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో 2024–25లో బహిరంగ ప్రదేశాల్లో 412 మంది కార్డియాక్‌ అరెస్ట్‌తో కుప్పకూలితే అక్కడికక్కడే సీపీఆర్‌ అందడంతో కేవలం 38 మందే బతికారు. అంటే సక్సెస్‌ రేట్‌ కేవలం 9.2%గానే నమోదైంది. ఈ లెక్కన బహిరంగ ప్రదేశాల్లో ప్రతి 10 మంది కార్డియాక్‌ అరెస్ట్‌ బాధితుల్లో 9 మందిని కోల్పోతున్నాం. బైస్టాండర్స్‌లో కేవలం 4.1% మందికే సీపీఆర్‌ చేయడం తెలియగా మిగిలిన 95.9% మందికి దాని గురించి తెలి యకపోవడమే అందుకు ప్రధాన కారణం.

విదేశాల్లో అలా.. మన దేశంలో ఇలా..
ఆధునిక సీపీఆర్‌ పద్ధతిని 1960లో అమెరికాకు చెందిన డాక్టర్‌ విలియం బి. కూవెన్‌Œహోవెన్, ఆయన బృందం అభివృద్ధి చేసింది. 65 ఏళ్ల తర్వాత చూస్తే నార్వే, డెన్మార్క్, అమెరికా ప్రభుత్వాలు 5వ తరగతి నుంచే స్కూల్‌ విద్యార్థులకు పాఠ్యాంశంగా సీపీఆర్‌ను చేర్చాయి. దీంతో ఆయా దేశాల్లో బైస్టాండర్‌ సీపీఆర్‌ రేట్‌ 60% దాటింది. ఫలితంగా కార్డియాక్‌ అరెస్ట్‌ సర్వైవల్‌ రేట్‌ 40%గా ఉంది. మరోవైపు జపాన్‌ ప్రభుత్వం పౌరులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేందుకు సీపీఆర్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. అలాగే జపాన్‌లోని ప్రతి రైల్వే స్టేషన్‌లో ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ మెషీన్‌ను ఆ దేశ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఇక యూకే ప్రభుత్వం నేషనల్‌ రీస్టార్ట్‌ ఎ హార్ట్‌ డే పేరుతో ఏటా 2 లక్షల మందికి సీపీఆర్‌పై ఉచిత శిక్షణ అందిస్తోంది. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) 2025 సర్వే ప్రకారం భారత్‌లో సీపీఆర్‌పై శిక్షణ పొందిన వారి సంఖ్య 1.3% నుంచి 9.8% మధ్యే ఉంది. హైదరాబాద్‌లో సీపీఆర్‌పై ప్రాథమిక అవగాహన ఉన్నవారు 4.1% మంది మాత్రమే ఉండగా తెలంగాణవ్యాప్తంగా ఇది కేవలం 2.8% గానే నమోదైంది.

30 నిమిషాల్లో నేర్చుకోవచ్చు..
సీపీఆర్‌ చేసేందుకు ఎంబీబీఎస్‌ డిగ్రీలు అవరసరం లేదని.. 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ ప్రక్రియను కేవలం 30 నిమిషాల్లో నేర్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు తమ సూచనలు అమలు చేస్తే కేవలం ఐదేళ్లలోనే కార్డియాక్‌ అరెస్ట్‌ కేసుల్లో సర్వైవల్‌ రేట్‌ 9 శాతం నుంచి 30 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సీపీఆర్‌ ఆవశ్యకతపై ప్రభుత్వాలకు వైద్య నిపుణుల సూచనలు ఇవీ..
8వ తరగతి నుంచే విద్యార్థులకు హెల్త్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా సీపీఆర్‌ను చేర్చి నార్వే మోడల్‌ అమలు చేయాలి.
⇒  డ్రైవింగ్‌ లైసె¯న్స్, పాస్‌పోర్ట్‌ జారీకి ముందు నిర్వహించే పోలీస్‌ వెరిఫికేషన్‌కు సీపీఆర్‌ సర్టిఫికెట్‌ను జత చేయడాన్ని తప్పనిసరి చేయాలి.
⇒  బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రదేశాల్లో ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫైబ్రిలేటర్‌ (ఏఈడీ) మెషీన్లు, సీపీఆర్‌ చార్టులు పెట్టాలి.
⇒  రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు, కాలేజీలు, ఆఫీసుల్లో ప్రతి 6 నెలలకోసారి సీపీఆర్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement