ఆన్‌లైన్‌ క్లాసులు: ఫీజు చెల్లించకుంటే ‘లైన్‌’కట్

Online Classes: Schools Suspension Of Online Classes Who have Not Paid Fee - Sakshi

నగరంలో సెకండ్‌ టర్మ్‌ ఫీజుల కోసం ప్రైవేటు ‘జులుం’ 

ఫీజులు చెల్లించని పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల నిలిపివేత 

50 శాతం చెల్లించక పోతే.. అడ్మిషన్‌ రద్దు చేస్తామని వార్నింగ్‌ 

కరోనా టైమ్‌లో ఆదాయం లేక చిరుద్యోగుల విలవిల 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోజుకు చెప్పే రెండు మూడు క్లాసులకే పూర్తి ఫీజులు వసూలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు ఈ ఫీజుల చెల్లింపు తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే ఫస్ట్‌ టర్మ్‌ ఫీజులు..పుస్తకాలు, నోటు బుక్స్, ఫోన్లు, కంప్యూటర్ల కొనుగోలు పేరుతో భారీగా ఖర్చు చేసిన తల్లిదండ్రులకు..సెకండ్‌ టర్మ్‌ ఫీజుల చెల్లింపు వారి కుటుంబాలను మరింత ఆర్థి్క సంక్షోభంలోకి నెట్టేస్తుంది. మొత్తం ఫీజులో 50 శాతం చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ క్లాసుకు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తాం! లేదంటే క్లాసు నుంచి డిస్కనెక్ట్‌ చేస్తాం! అంటూ యాజమాన్యాలు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక ఆయా స్కూళ్ల ముందే నిరసనకు దిగుతున్నా పట్టించుకున్న నాధుడే లేరు. అంతేకాదు ఆయా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.   

అనుమతించక పోయినా..ఆన్‌లైన్‌ తరగతులు 
తెలంగాణ వ్యాప్తంగా 10549 పాఠశాలలు ఉండగా, వీటిలో 30 లక్షల మంది వివిధ తరగతులు చదువుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మూడు వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో పది లక్షల మంది పిల్లలు ఉన్నారు. నిజానికి జూన్‌ 12 నుంచి అన్ని స్కూళ్లు రీ ఓపెన్‌ కావాల్సి ఉండగా, కరోనా విజృంభి స్తుండటంతో ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. ప్రభుత్వం అనుమతించక పోయినప్పటికీ నగరంలోని పలు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తుంది.  

27 పాఠశాలలపై ఫిర్యాదులు అందినా.. 
పలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే ఫస్ట్‌ టర్మ్‌ ఫీజులు వసూలు చేశాయి. అడిగినంత ఫీజు చెల్లించిన వారికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇచ్చి పాఠాలు వినే అవకాశం కల్పిస్తున్నాయి. ఫీజు చెల్లించని వారిని ఇందుకు దూరంగా ఉంచుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్‌ ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు ఆయా పాఠశాలలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోని 27 పాఠశాలపై ఫిర్యాదులు అందాయి. దీంతో సబంధిత అధికారులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలపై కూడా చర్యలు తీసుకోలేదు.  కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం విశేషం. కరోనా వల్ల ఉపాధి అవకాశాలు లేక ఆదాయం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఈ ఫీజులు మరింత ఆవేదనను మిగుల్చుతున్నాయి.  

ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై కేసులు 
కరోనా సమయంలో ఫీజులు పెంచొద్దని పేర్కొంటూ ప్రభుత్వం జీఓ నెంబర్‌ 46 జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలోని ఏ ఒక్క పాఠశాల కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. పలు కార్పొరేట్‌ స్కూళ్లు గతేడాది కంటే ఎక్కువ గా రూ. పది వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లను నిరసిస్తూ ఇటీవల పలువురు తల్లిదండ్రులు ఆయా కార్పొరేట్‌ పాఠశాలల ముందు ఆందోళనకు దిగడం తెలిసిందే. తల్లిదండ్రులకు అండగా నిలువాల్సిన అధికారులు, పోలీసులు ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. 

ట్యూషన్‌ ఫీజుకు మించి వసూలు చేయొద్దు 
హైదరాబాద్‌ జిల్లాలోని ఏడు ప్రైవేటు పాఠశాలలపై ఫిర్యాదులు అందాయి. అధికారుల విచారణలో మూడు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వివరించాం. ఇకపై కూడా ఏదైనా స్కూలుపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడుతాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే అట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోం. ప్రభుత్వం కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. అంతకు మించి వసూలు చేస్తే చర్యలు తప్పవు. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్‌ 

ఇంటర్‌ కళాశాలల్లోనూ అంతే! 
సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లాకు చెందిన మధుప్రియ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. గతేడాది ఫస్టియర్‌ పూర్తి చేసుకుని, ప్రస్తుతం సెకండియర్‌కు చేరుకుంది. అయితే సెకండియర్‌కు అడ్మిషన్‌ రెన్యూవల్‌ చేయాలంటే తొలి విడతగా రూ.20 వేలు ఫీజు చెల్లించాల్సిందిగా కాలేజీ నుంచి ఆమె తండ్రికి ఫోన్‌ చేశారు. లేదంటే అడ్మిషన్‌ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఇది ఒక మధుప్రియ తండ్రికి ఎదురైన అనుభవం మాత్రమే కాదు.. పలు కార్పొరేట్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ పూర్తి చేసుకుని సెకండియర్‌లోకి అడుగుపెడుతున్న అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటర్‌లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో కార్పొరేట్‌ కాలేజీలు ఫీజులు పేరుతో వేధింపులకు దిగుతున్నాయి. క్లాసుల నిర్వహణ, ఫీజుల వసూలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు ఆఫ్‌లైన్‌లో చెల్లించే మొత్తం ఫీజులను ఎలా చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 

తరగతుల ప్రారంభానికి ముందే.. 
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో గత విద్యా సంవత్సరం 2,00,332 మంది విద్యార్థులు ఫస్టియర్‌ పూర్తి చేసుకోగా.. మరో 2,03,948 మంది సెకండియర్‌ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఫస్టియర్‌ పూర్తి చేసుకుని సెకండియర్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు అధికారికంగా ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాలేదు. కానీ.. కొన్ని కార్పొరేట్‌ కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. 
మొత్తం ఫీజులో 50 శాతం తొలి విడతగా చెల్లించాలని, లేదంటే అడ్మిషన్‌ రద్దు చేస్తామన్న  కాలేజీల హెచ్చరికలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరవకముందే అప్పుడే 50 శాతం ఫీజు ఎలా చెల్లిస్తామని వాపోతున్నారు. నిజానికి ఫస్టియర్‌లో చేరిన విద్యార్థి అడ్మిషన్‌ ఆటోమెటిక్‌గా సెకండియర్‌కు రెన్యూవల్‌ అవుతుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top