చిన్న రాష్ట్రం.. వేతన కష్టం | One-fourth of the total annual expenditure of states goes to employee salaries | Sakshi
Sakshi News home page

చిన్న రాష్ట్రం.. వేతన కష్టం

Jun 22 2026 6:05 AM | Updated on Jun 22 2026 6:06 AM

One-fourth of the total annual expenditure of states goes to employee salaries

ఆరు రాష్ట్రాల ఏడాది ఖర్చులో 25 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకే 

దేశంలోనే అత్యల్పంగా గుజరాత్‌లో 6.25% వేతన ఖర్చు.. తెలంగాణలో 14%

తెలంగాణలో పింఛన్ల ఖర్చు 7.7 శాతం... దేశంలో అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లో 6% 

సబ్సిడీల్లో కర్ణాటక టాప్‌... 14% ఖర్చు సబ్సిడీలకే 

కర్ణాటకతో పోలిస్తే తెలంగాణలో సబ్సిడీలకు వెచ్చిస్తోంది సగమే 

వెల్లడించిన కాగ్‌ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని చిన్న రాష్ట్రాలు ఏటా పెట్టే మొత్తం ఖర్చులో పావలా వంతు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నాగాలాండ్, మణిపూర్, హిమాచల్‌ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మిజోరం రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్‌లో 25 శాతానికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే వెచ్చించాయి. అత్యధికంగా నాగాలాండ్‌ మొత్తం బడ్జెట్‌లో 37 శాతం వేతనాలకు ఖర్చు చేసినట్లు కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘స్టేట్‌ ఫైనాన్సెస్‌’పేరుతో కాగ్‌ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2015–16 నుంచి 2024–25 వరకు పదేళ్లపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ నివేదికలో వెల్లడించింది. 
 
ఏ రాష్ట్రంలో ఎలా ఉందంటే..  
2024–25లో వేతనాలకు తెలంగాణ మొత్తం బడ్జెట్‌లో 14.19 శాతం ఖర్చు చేస్తోంది. ఏపీ (16.96%), కేరళ (22.96%) కూడా వేతనాలకు గణనీయంగానే ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక (6.59 శాతం), మహారాష్ట్ర (8.51%) మాత్రం తక్కువ నిధులు వెచ్చిస్తున్నాయి.  


వేతనాలకే కాక ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం కూడా చిన్న రాష్ట్రాలే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా తన ఏడాది బడ్జెట్‌లో పింఛన్లకు హిమాచల్‌ ప్రదేశ్‌ 19,63 శాతం ఖర్చు చేస్తుండగా.. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌ 5.84 శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. ఇక, దక్షిణాది విషయానికి వస్తే కేరళ టాప్‌లో నిలిచింది. ఈ రాష్ట్రంలో పింఛన్ల కోసం 16.04 శాతం ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 7.77 శాతం ఖర్చు చేస్తోంది.  

⇒ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 19 శాతం నిధులను వడ్డీల కోసం పంజాబ్‌ ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 13 శాతం ఖర్చు పెడుతోంది. అత్యల్పంగా ఒడిశా 2.52 శాతం మాత్రమే చెల్లిస్తోంది.  

⇒ ఆహార, విద్యుత్, ఇతర సబ్సిడీల కింద దేశంలోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 14 శాతం నిధులు సబ్సిడీల కోసమే ఖర్చు చేస్తుండగా, అందులో సగం మాత్రమే మన రాష్ట్రంలో సబ్సిడీల రూపంలో ఖర్చవుతోంది. దేశంలోనే అత్యల్పంగా మొత్తం బడ్జెట్‌లో 0.02 శాతం మాత్రమే అరుణాచల్‌ ప్రదేశ్‌లో సబ్సిడీల కింద ఖర్చవుతోంది. కేరళలో ఇది 1.07 శాతమే కావడం గమనార్హం. 
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement