12లక్షల ర్యాంకుకు ఎన్నారై కోటా సీటు  | NRI quota seat for 12 lakh rank | Sakshi
Sakshi News home page

12లక్షల ర్యాంకుకు ఎన్నారై కోటా సీటు 

Sep 1 2023 3:00 AM | Updated on Sep 1 2023 3:00 AM

NRI quota seat for 12 lakh rank - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ సీట్లకు జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌లో.. ఎన్నారై కోటా (సీ కేటగిరీ)లో గరిష్టంగా 12 లక్షల నీట్‌ ర్యాంకర్‌ వరకు సీట్లు లభించాయి. అదే బీ కేటగిరీలో 5.39 లక్షల ర్యాంకర్‌ వరకు సీట్లు వచ్చాయి. తదుపరి జరగనున్న రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఈ ర్యాంకులు మరింత పెరిగే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి.

ఎంబీబీఎస్‌ బీ, సీ కేటగిరీల తొలివిడత కౌన్సిలింగ్‌లో సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ గురువారం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కన్వీనర్‌ కోటా కింద నీట్‌లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో కన్వినర్‌ కోటా సీటు లభించిన సంగతి తెలిసిందే.

కన్వీనర్‌ కోటాకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. అందులో రిజర్వేషన్‌ కేటగిరీల్లో ఇంకా పెద్ద ర్యాంకుకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
ఎన్నారై సీట్లపై అనాసక్తి.. 
రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్‌ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు, 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్‌ కోటా కింద భర్తీ చేస్తారు.

ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది.

ఇలా అడ్డగోలు ఫీజులు ఉండటంతో.. 700 సీట్లు అందుబాటులో ఉన్నా.. 330 మంది మాత్రమే వాటికి ఆప్షన్‌ పెట్టుకున్నారు. చివరివరకు కన్వినర్, బీ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించి.. వాటిలో రానివారు మున్ముందు ఎన్నారై కోటా కింద చేరే అవకాశాలు ఉంటాయని వైద్యవిద్య వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్నారై కోటాలో ఎంబీబీఎస్‌ చేసే బదులు.. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్‌ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన కూడా ఉందని అంటున్నాయి. 

నేటి నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు షురూ 
2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతులు శుక్రవారం (సెపె్టంబర్‌ 1) నుంచి ప్రారంభం అవుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. పీజీ మెడికల్‌ తరగతులు ఈ నెల ఐదో తేదీ నుంచి మొదలవుతాయని తెలిపింది.

ఇప్పటికే ఎంబీబీఎస్, పీజీలలో కన్వినర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటాలకు తొలి విడత కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. దీంతో తరగతులు ప్రారంభించాలని ఎన్‌ఎంసీ ఆదేశించిన నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.

కాగా.. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌లలోని ఈ కాలేజీల్లోనూ శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement