టిమ్స్‌లో 184 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు | Notifications for 184 jobs in TIMS | Sakshi
Sakshi News home page

టిమ్స్‌లో 184 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

Jun 24 2026 3:58 AM | Updated on Jun 24 2026 3:58 AM

Notifications for 184 jobs in TIMS

జూలై 6న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

సాక్షి, హైదరాబాద్‌: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో డాక్టర్లు, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది సహా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టిమ్స్‌ను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చే యాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నియా మక ప్రక్రియ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించారు.  

భర్తీ చేసే పోస్టులివీ... 
నిమ్స్‌ మంగళవారం మొత్తం 184 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో 31 మెడికల్‌ ఫ్యాకల్టీ పోస్టులు, 122 టెక్నికల్, అలైడ్‌ హెల్త్, అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు, 31 సపోర్ట్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మెడికల్‌ ఫ్యాకల్టీ కేటగిరీలో 5 ప్రొఫెసర్, 2 అసోసియేట్‌ ప్రొఫెసర్, 24 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరోసర్జరీ వంటి సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. 

టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో ల్యాబ్, అనస్థీషియా, ఎంఆర్‌ఐ, సీటీ, ఎక్స్‌రే, బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్లతో పాటు మెడికల్‌ రికార్డు ఆఫీసర్, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, స్టాటిస్టీషియన్, రిజిస్ట్రార్, అకౌంట్స్, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా లీగల్‌ ఆఫీసర్, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్, బయోమెడికల్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఇంజినీర్లు, ఫైర్‌ ఆఫీసర్లు, ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.  

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
మెడికల్‌ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో డీఎం, ఎం.సీహెచ్, డీఎన్‌బీ, డాక్టర్‌ఎన్‌బీ అర్హతలతో పాటు నిమ్స్, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలను నిర్దేశించారు. మెడికల్‌ ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 ఏళ్లుగా నిర్ణయించగా, ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయోపరిమితి వర్తిస్తుంది. 

అభ్యర్థులు జూలై 6 వరకూ దరఖాస్తులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెడికల్‌ ఫ్యాకల్టీ పోస్టులకు అభ్యర్థులు జూలై 6 ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో జరిగే వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలతో జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో సమర్పించాలి. పోస్టుల వారీగా అర్హతలు, వేతనాలు, రిజర్వేషన్ల వివరాలు నిమ్స్‌ వెబ్‌సైట్‌  www.nims.edu.in లో అందుబాటులో ఉన్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement