ఫస్ట్‌ డే... 2,155 | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ డే... 2,155

Published Tue, Dec 22 2020 1:00 AM

Non Agricultural Registrations In Old Manner In Telangana - Sakshi

రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. తొలిరోజు సోమవారం సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 2,155 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.19.3 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ధరణి ద్వారా కొత్త పద్ధతిలో 10 రోజుల్లో 1,760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే, సోమవారం ఒక్కరోజే పాత పద్ధతిలో దానికి మించి రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం.  హైదరాబాద్‌ శివార్లలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. సంగారెడ్డి, రంగారెడ్డి–1, కుత్బుల్లాపూర్‌ లాంటి కార్యాలయాల్లో ఒక్కోచోట 120కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు తొలిరోజు సోమవారం సజావుగా సాగాయి. పాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటు ప్రజలకు, అటు సిబ్బందికి సుపరిచితం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 2,155 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.19.3 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ధరణి ద్వారా కొత్త పద్ధతిలో 10 రోజుల్లో 1,760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే, సోమవారం ఒక్కరోజే పాతపద్ధతిలో దానికి మించి 
రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. 

హైదరాబాద్‌ శివార్లలో భారీగా..
పాత పద్ధతిలో మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అటు డాక్యుమెంట్‌ రైటర్లు, ఇటు లావాదేవీల కోసం వచ్చే ప్రజలతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిండిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ శివార్లలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌లు జరిగాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి–1, కుత్బుల్లాపూర్‌ లాంటి కార్యాలయాల్లో ఒక్కోచోట 120కి పైగా రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఎల్‌బీ నగర్, గండిపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ లాంటి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కూడా ప్రజలు వచ్చారు. సోమవారం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి 10 నిమిషాల్లో డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి గంటలోపే రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు స్కాన్‌ చేసి ఇచ్చేశామని సిబ్బంది పేర్కొన్నారు. చదవండి: (సంక్షేమానికి ఆధార్‌ అడగొచ్చు)

ధరణి ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న స్లాట్లను, చలాన్లను కూడా కార్డ్‌ పద్ధతిలోకి మార్చి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. సోమవారం ఒక్కరోజే 5,556 ఈ చలాన్లు కట్టగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.76.1 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, ఈ నెలలో మొత్తం 12,359 చలాన్లు రాగా, 135.6 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ చలాన్లు ఆరునెలల పాటు చెల్లుబాటవుతాయి కాబట్టి ఆలోపు ప్రజలు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశముంది. తొలిరోజు రద్దీ ఉంటుందనే అంచనాతో ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా ముగిసింది.

ఎల్‌ఆర్‌ఎస్‌....తలనొప్పులు 
పాత పద్ధతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేని భూములను కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తారనే అంచనాతో చాలా మంది సోమవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని సిబ్బంది తేల్చిచెప్పడంతో నిరాశకు గురయ్యారు. దీనిపై ప్రజలు కొన్నిచోట్ల సబ్‌రిజిస్ట్రార్లతో వాగ్వాదానికి దిగగా మరికొన్ని చోట్ల రియల్టర్లు, ప్రజలు కలిసి ఆందోళనలకు దిగారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement