ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి

Newborn Died At Gadwal Government Hospital Due To Doctor Negligence - Sakshi

సాక్షి, గద్వాల: ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యురాలు నిర్లక్ష్యం కనబరచడంతో పురిటిలోనే శిశువు మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని వైద్యులు చెప్పారు.  ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద, సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కాన్పు కాకముందే వెళ్లిపోవడం వల్లే పసికందు మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వైద్యురాలు నర్మద స్పందిస్తూ పాప ఉమ్మనీరు తాగి పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్‌ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదన్నారు. కాన్పు కాకముందే వెళ్లిపోయానన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన డ్యూటీ సమయం అయిపోయినప్పటికీ విధులు నిర్వహించానని పేర్కొన్నారు. 

పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్‌ వల్లూరి క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో వైద్యుల తప్పిదం ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.  

గతంలోనూ సస్పెండ్‌
డాక్టర్‌ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్‌ అయినట్లు తెలిసింది. ధరూర్‌ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు. దీంతో అప్పటి కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top